Wednesday, January 22, 2025

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం…

- Advertisement -
- Advertisement -
జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం
9 ఏళ్లలో 21 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు
జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉన్న మెడికల్ సీట్లు
5265కు పెరిగిన ఎంబీబిఎస్ సీట్లు 
2832కు చేరిన పీజీ, 138కి పెరిగిన సూపర్ స్పెషాలిటీ సీట్లు
మరో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలకు అనుమతులు
వచ్చే ఏడాది నుండి ప్రవేశాలు జరిపేందుకు వసతులు ఏర్పాట్లు

హైదరాబాద్: రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య, విద్య చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేసి, ప్రజలందరికీ మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలంటే అందుకు వైద్య విద్యను విస్తృతం చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని భావించిన సిఎం కెసిఆర్ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ఆ వైద్య కళాశాలలు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేవి. 2014లో రాష్ట్రం ఆవిర్భవించాక ప్రజాకవి కాళోజి పేరిట కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ను స్థాపించి వరంగల్ కేంద్రంగా దీనిని ఏర్పాటు చేసి రాష్ట్రానికి చెందిన వైద్య కళాశాలలన్నీ కాళోజీ విశ్వవిద్యాలయానికి అనుబంధం చేశారు. 2016 నుండి కాళోజీ విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో ప్రవేశాలను చేపట్టింది. మెడికల్ తో పాటు దంత, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యాచురోపతి, నర్సింగ్, ఫీజియోథెరపీ, ల్యాబ్ టెక్నిషియన్ యూజీ, పీజీ కోర్సులతో పాటు అన్‌లైన్‌డ్ హెల్త్ సైన్సెస్ కోర్సులను యూనివర్సిటీ చేపడుతోంది.
గణనీయంగా పెరిగిన కళాశాలలు, సీట్లు :
మెరుగైన వైద్యం అందించాలంటే వైద్య నిపుణులు అవసరం ఎంతో వుంది అని గుర్తించిన సిఎం కెసిఆర్ అందుకు తగ్గట్టే కొత్త కళాశాలలను పెడుతూ సీట్లను గణనీయంగా పెంచారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఐదు ప్రభుత్వ కళాశాలలు 15 ప్రైవేటు కళాశాలల్లో 2950 ఎంబీబిఎస్ సీట్లు ఉండగా 9ఏళ్లలో 21నూతన ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేశారు. అదే విధంగా రాష్ట్రంలో నూతనంగా 13 ప్రైవేటు కళాశాలు ఏర్పాటు అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3690 , ప్రైవేట్ కళాశాలల్లో 4525 మొత్తంగా 8215 ఎంబీబిఎస్, ప్రభుత్వ ప్రైవేటు కలిపి 2832 పీజీ, 138 సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కళాశాలల ఏర్పాటుతో ఎంబీబిఎస్ సీట్లు 5265, పీజీ లో 1649 సీట్లు సూపర్ స్పెషలిటీ లో 59 సీట్లు అదనంగా పెరిగాయి. ములుగు, నర్సంపేట, యాదాద్రి, మహేశ్వరం, మెదక్, కుత్బుల్లాపూర్, గద్వాల్, నారాయణపేటలో ఈ ఏడాది మరో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వచ్చే ఏడాది ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరిన్ని సీట్లు పెరగనున్నాయి. ఇవన్నీ ప్రజారోగ్యం పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
వైద్య అనుబంధ విద్యపై ప్రత్యేక దృష్టి :
నూతన రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఉన్న ఆసుపత్రులను బలోపేతం చేస్తూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతోంది. అదే విధంగా వ్యాధి నిర్ధారణ, చికిత్సకు ముఖ్యంగా గుండె, ఇతర సర్జరీలు, కాన్సర్,డయాలిసిస్ సెంటర్లు, టి డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, పాలేటివ్ కేర్, క్రిటికల్ కేర్ యూనిట్ లలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి రోగులకు మెరుగైన చికిత్స అందిస్తోంది. ఆసుపత్రులలో వైద్య అనుబంధ సాంకేతికత పెరగడంతో వైద్య ఆధునిక యంత్రాల వినియోగం అలాగే వైద్యులకు సహకారం అందించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని వైద్య అనుబంధ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

అనెస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియో వాస్క్యూలర్ టెక్నాలజీ, రీనల్ డియాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ అండ్ రేడియో థెరఫీ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియోలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డు సైన్స్ తదితర 12 అనుబంధ వైద్య ఆరోగ్య కోర్సులకు గత ఏడాది ప్రభుత్వం అనుమతించింది. 11 కోర్సులలో 780 సీట్లకు యూనివర్సిటీ ప్రవేశాలు కలిపించింది. నర్సింగ్ సేవలకు ఇతర రాష్ట్రాల పై ఆధారపడకుండా నర్సింగ్ కళాశాలలను కూడా ప్రభుతం పెంచింది. రాష్ట్రంలో నర్సింగ్ కళాశాలలు 100కి చేరుకున్నాయి. అంతేకాకుండా 23 ఫీజియోథెరపీ కళాశాలల్లో 1100 సీట్లు, 20 ల్యాబ్ టెక్నిషియన్ కళాశాలల్లో 735 సీట్లకు యూనివర్సిటీ ప్రవేశాలు చేపడుతోంది. ఇంటర్ తరవాత ఎంబీబిఎస్ సీట్లు రాని వారికి ఇటువంటి డిగ్రీ కోర్సులు విద్య ఉపాధి కలిపించడంతో పాటు అనుబంధ వైద్య సేవలు అభివృద్ధి చెందుతాయన్న ప్రభుత్వ దూరదృష్టి అభినందనీయం అనే చెప్పవచ్చు. అటు వైద్య విద్యను ప్రోత్సహిస్తూ ఇటు వైద్య సేవలను విస్తృత పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News