ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో పలువురు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆర్కిటెక్చర్‌లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు ఆస్పత్రులు, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి ఆర్కిటెక్స్‌లు రూపొందించిన డిజైన్‌లను ఆయన పవర్‌పాయింట్‌ల ద్వారా పరిశీలించారు. కొత్తగా వరంగల్‌లో సూపర్ మల్టీస్పెషాలిటీ, హైదరాబాద్ నగరం నలువైపులా 4 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు నిమ్స్ ఆస్పత్రి విస్తరణ, సంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, రామగుండంలో నిర్మించే మొత్తం 8 కొత్త మెడికల్ కాలుజీలతో పాటు సంగారెడ్డి, మహబూబాబాద్‌చ భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట, గద్వాల, బాన్సువాడలో నిర్మించే మొత్తం 14 నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ఇందులో పలు డిజైన్లలో మార్పులు, చేర్పులను మంత్రి సూచించారు. తరువాత జరిగే సమావేశం నాటికి మార్చిన డిజైన్‌లను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.