Saturday, November 16, 2024

కార్పొరేట్లకిస్తున్న ఉచితాలు!

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు ఉచితాలు అనుచితాల చర్చకు తెర తీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు అజండాను ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు గనుకనే ఇటీవల నాగపూర్‌లో టికెట్ కొని మెట్రో రైలు ఎక్కి తాను ప్రధాని పదవిలో ఉన్నా ఉచితంగా రైలెక్కను అనే సందేశమిచ్చారు. ఏదీ ఊరికే రాదు అన్న ఒక నగల వర్తకుడి వాణిజ్య ప్రకటనను చాలా మంది చూసే ఉంటారు. మోడీ టికెట్ కౌంటర్‌లో ఉన్న ఫోటో మాదిరి ఉచితాల వ్యతిరేక చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఏది ఉచితం, ఏది కాదు అన్నచర్చ చాలా రోజులుగా జరుగుతున్నది. విశ్వగురువు నరేంద్ర మోడీ వివిధ సందర్భాలలో చేసిన ప్రవచనాల సారం ఏమిటి? రివాదీ (ఉచితాలు) సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరం.

ఈరోజు దేశంలో ఉచితాల ద్వారా ఓట్లను దండుకొనేందుకు కొన్ని పార్టీలవారు చూస్తున్నారు. ప్రత్యేకించి యువత ఈ ఉచిత సంస్కృతి గురించి జాగ్రత్తగాఉండాలి. జనాలకు ఉచితాలు ఇవ్వటం ద్వారా మీకు అవసరమైన రహదారులు, విమానాశ్రయాలు లేదా రక్షణ నిర్మాణాలు జరగవు. ఈ ఆలోచనలు చేసే వారిని ఓడించాల్సి ఉంది. మోడీ వయస్సు ఇప్పుడు 73 నడుస్తున్నది. బహుశా ఇతర మానవ మాత్రుల మాదిరి ఆయనకూ జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది (2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోకకల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేశారు.దానిలో పేర్కొన్న అంశాలను చూస్తే ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం (కరోనా పేరుతో రైళ్లలో వృద్ధ స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను మోడీ సర్కార్ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పథకం కింద హోలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నపూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి.

బహుశా బిజెపి నిఘంటువులో వీటికి వేరే అర్ధం ఏమన్నా ఉన్నట్లా లేక నరేంద్ర మోడీకి ఈ సంకల్పం గురించి గుర్తు లేదా లేక నటిస్తున్నారా? ఇదే ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022 23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ఏడాది మాదిరే 2017లో కూడా హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన పక్షం రోజులకు గుజరాత్ ఎన్నికలను ప్రకటించారు. ‘హిమాచల్ ఎన్నికల ప్రకటన తేదీ నుంచి గుజరాత్‌లో కురుస్తున్న ఉచితాల వాన’ అని సిఎన్‌ఎన్ న్యూస్ 18 అక్టోబరు 26, 2017న ఒక వార్తను ప్రచురించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే 24 గంటల ముందు బిజెపి సర్కార్ నాలుగు పెద్ద పథకాలను ప్రకటించిందని దానిలో పేర్కొన్నారు. (మోడీ నైతిక విలువల వెలుగులో పెరిగిన బిజెపి కూడా ఇతర పార్టీల మాదిరే ఇలా చేస్తుందా అని ఆశ్చర్యపోవద్దు, ఎంతవారలైనా కాంతదాసులే అన్న కవి ఇప్పుడుంటే పార్టీలన్నీ అధికార దాసులే అనే వారు) డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కొనుగోలుపై రైతులకు 18 శాతం జిఎస్‌టి రద్దు, రైతులకు సున్నా వడ్డీకి రుణాలు వాటిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతాంశానికి వస్తే అవ్‌ుదానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్ర మోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు.

గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి కేంద్ర ఆఫీసులో మాట్లాడుతూ దేశానికి తొలి ప్రాధాన్యత అన్నది బిజెపి విధానమని, ఏది తమకు అనుకూలంగా పని చేస్తుందో ఏది వ్యతిరేకమో ఓటర్లకు తెలుసునని, దగ్గర దారి రాజకీయాలు దేశానికి నష్టమని వారికి తెలుసు అన్నారు. దేశం బాగుపడితే ప్రతి ఒక్కరూ సంపదలు పొందుతారని చెప్పారు. ఉచితాలు కొనసాగితే ఈ రోజు మన పొరుగుదేశాల్లో జరుగుతున్న మాదిరే పరిస్థితి ఉంటుందని, అందువలన అలాంటి ఎత్తుగడలు ఎవరికీ లబ్ధి ఉండదు అన్నారు. ఇలాంటి సుభాషితాలను ఒక వైపు వినిపిస్తూ మరో వైపు గుజరాత్ నేతలకు ఏ మార్గదర్శనం చేశారో చూడండి. ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 39 లక్షల మందికి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.’ (డెక్కన్ హెరాల్డ్ 2022 నవంబరు 13). ‘బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలెక్ట్రిక్ స్కూటీలు కూడా ఉన్నాయి. బిజెపి కూడా ఉచితాల క్రీడా బరిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్య తరగతిని ఆకర్షించేందుకు పూనుకుంది.

గుజరాత్ ఆర్థిక వ్యవస్థను (జిఎస్‌డిపి) లక్ష కోట్ల డాలర్లకు పెంచుతామని (202223లో అంచనా రూ. 22 లక్షల కోట్లు, డాలర్లలో 280 బిలియన్లు. 201819లో రూ. 15 లక్షల కోట్లు, అది గత ఐదేండ్లలో 22 లక్షల కోట్లకే పెరిగింది. అలాంటిది ఐదేండ్లలో లక్షకోట్ల డాలర్లంటే 1000 బి.డాలర్లకు ఎలా చేరుతుంది.) 2036లో అహమ్మదాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని పేర్కొన్నది. (గుజరాత్‌పై టైవ్‌‌సు ఆఫ్ ఇండియా 2022 నవంబరు 27 తేదీ సంపాదకీయం). ఆలూ లేదూ చూలూ లేదు, 2036 ఒలింపిక్స్ నిర్వహణ ఎవరికి అప్పగిస్తారనేది 2025 29 సంవత్సరాల మధ్య ప్రకటించే అవకాశం ఉంది. మన దేశానికి అవకాశం వస్తుందో రాదో చెప్పలేము.అలాంటిది ఏకంగా నిర్వహిస్తామని ఇప్పుడే బిజెపి చెప్పటం జనాలను అమాయకులుగా పరిగణించటం తప్ప మరొకటి కాదు. తాను ప్రకటించే ఉచితాలు సాధికారతలో భాగమని, ఇతరులు ప్రకటించే వాటిని ప్రలోభాలని బిజెపి చిత్రిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో రైతులకు విద్యుత్ సబ్సిడీగా రూ. 15,700 కోట్లు ఇస్తున్నట్లు 2021 అక్టోబరులో అక్కడి బిజెపి సర్కార్ ప్రకటించింది. అదే విధంగా గృహాలకు 202122కు గాను రూ. 4,980 కోట్లు కేటాయించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమాచల్‌ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్ ఏప్రిల్ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రూ. 250 కోట్లు లబ్ధి చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ర్ట ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 1860 సంవత్సరాల మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించిం ది. తమను తిరిగి ఎన్నుకుంటే వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని రూ. 200 నుంచి రూ.1000కి పెంచుతామని మణిపూర్ బిజెపి ప్రకటించింది. నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రతి పైసాకు జవాబుదారీ అన్న సంగతి తెలిసిందే. ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చూస్తున్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వరంగ బాంకులు రూ. 10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా, ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రూ. 1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది. (2022, డిసెంబరు 13 వ తేదీ వార్త). ఇవన్నీ బడాబాబులు, కావాలని ఎగవేసిన రుణాలన్నది అందరికీ తెలిసిందే.

పారు బాకీల రద్దు కాదు, వేరు ఖాతాల్లో చూపుతున్నామని అంటున్నారు. ఇంత తక్కువగా వారి నుంచి రాబట్టటంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిదన్నది స్పష్టం. అలాంటి పెద్ద మనుషుల పేర్లు వెల్లడిస్తే వారి మర్యాదలకు భంగం అని చెబుతున్నారు. వారితో బాంకులు ఉన్నతాధికారులు కుమ్మక్కు కాకుండా అలాంటి రుణాలు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్ర రుణాలను తీసుకోవటం తప్ప తిరిగి చెల్లించనవసరం లేదనే అభిప్రాయం ఉంది. ఎగవేసిన వారు చిన్నవారా పెద్దవారా అని కాదు ఎలాంటి సందేశం జనాల్లోకి వెళుతున్నదనేది కీలకం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ పథకాల కారణంగానే తిరిగి అధికారానికి వచ్చిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. అక్కడ ముద్రా రుణాల కింద పద్దెనిమిదివేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద ఇచ్చే రుణాలను క్రెడిట్ గారంటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా మంజూరు చేస్తారు గనుక చెల్లించకున్నా బాంకులు ఎలాంటి ఇబ్బందులు పడవని బాంకు అధికారుల సంఘం పేర్కొన్నది.

చిన్న, సన్నకారు సంస్థలకు ఇచ్చే ఈ రుణాల నిరర్ధక ఆస్తుల మొత్తం 2021 మార్చి 31 నాటికి 11.98 శాతం లేదా రూ. 2.84 లక్షల కోట్లని ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం వెల్లడించింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పిఎలు కేవలం 5.38 శాతమే. ఇదేమీ చిన్న మొత్తం కాదు, పైసల్లో అంతకంటే లేదు. ఇది కూడా పన్ను చెల్లించిన వారి సొమ్మే మరి. కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్ పన్నును 30 నుంచి 22కు, 15 శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా? అది దేశానికి, జనానికి లబ్ధి చేకూర్చుతున్నదా? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటా రా, దోచిపెడుతున్న సొమ్మంటారా? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్ర మోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు.

రైతులు ఆ సొమ్మును స్విస్ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లేగా! తమిళనాడు ప్రభుత్వం కార్పొరేట్లకు రద్దు చేస్తున్న రుణాల గురించి సుప్రీంకోర్టు కేసులో ప్రస్తావించింది. మోడీ తొలి మూడేండ్ల పాలనలో అదానీ తీసుకున్న రుణాల్లో 75 వేల కోట్లను మాఫీ చేసిందని పేర్కొన్నది, లేదూ పక్కన పెట్టామంటే ఎంత వసూలు చేసిందీ చెప్పాలి కదా! ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా కొన్ని వేల కోట్లు పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది, ఏమంటే అవి ఎగుమతికి పనికి వస్తాయట. కాసేపు అంగీకరిద్దాం, రైతులు పండించే వరి, గోధుమలు, చెరకునుంచి తీసే పంచదార కూడా ఎగుమతి చేస్తు న్నాం, మరి వారికి ప్రోత్సాహకాలను ఎందుకు ఇవ్వటం లేదు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News