Sunday, December 22, 2024

తెలంగాణలో పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన అత్యధునికమైన ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదలకు అందుబాటులోకి తేవడంతో సర్కారు దవాఖానాల పట్ల నమ్మకం కలిగిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుదవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది నిర్వహించిన భారీ ర్యాలీని మంత్రి సత్యవతి, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మైన్ కుమారి అంగోతు బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్‌రాజ్‌లతో కలసి శాంతి కపోతాలను ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో రూ.88.88 లక్షలతో నిర్మించిన డి.ఈ.ఐ.సి బ్లాక్‌ను మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు.

అలాగే రేడియోలజీ ల్యాబ్‌ను, రోగుల బంధువుల కోసం నిర్మించిన విశ్రాంతి షెడ్డును మంత్రి ప్రారంభించారు. గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లను మంత్రి అందించారు. ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. అనంతరం మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన కార్పొరేట్ వైద్యం..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రంలో మహిళలు, శిశువుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని వివరించారు. ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్లతో బాల, బాలికల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. మాతా, శిశు మరణాల శాతాన్ని సంపూర్ణంగా తగ్గడం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నమోదైందని మంత్రి పేర్కోన్నారు. పోషకాహార లోపాన్ని నివారించి శిశువుల, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఆరోగ్యవంతమైన పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధ్దం చేస్తోందని చెప్పారు.

గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యం కోసం రూ. నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 12,325 వేల కోట్లన ఖర్చు చేస్తోందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డయాలసిస్, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణే అని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు. 6.80 వేల మందికి 250 కోట్లతో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్‌లను అందిస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం ఇతం సూక్షంగా ఆలోచించే ‚ఇఎం మన రాష్ట్రానికి ఉండడం మన అదృష్టంగా భావించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రికార్డు స్థాయిలో నార్మల్ డెలివరీలు పెరిగాయని పేర్కోన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో కేవలం 24 గంటల్లోనే 19 నార్మల్ డెలీవరీలు చేసి రాష్ట్రస్థాయిలో రికార్డును నెలకొల్పడం విశేషమని తెలిపారు.

ఇందుకు తోడ్పాడ్డ వైద్యులు, వైద్య బృందాన్ని మరోసారి అభినందిస్తున్నట్లు ప్రకటించారు. గత పాలకుల ఏలికల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన వైద్య సదుపాయాలు లేక ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందన్నారు. వైద్యం కోసం ప్రజలు ఇల్లు, వాకిలి, భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి భయటపడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలన్నీ నేడు పురుడు పోసుకునన తల్లుల నవ్వులతో, పసిపిల్లల కేరింతలతో కళకళలాడుతున్నాయని మంత్రి సత్యవతి వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వ వైద్యానికి జనాదరణ పెరుగుతుందనడానికి కార్పొరేట్ దవాఖానాల్లో గిరాకీ తగ్గి వెలవెలబోవడమే సాక్షమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మైన్ కుమారి అంగోతు బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్‌రాజ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ లకావత్, వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News