నిందితుల మధ్య ఘర్షణ, సర్ధిచెప్పిన పోలీసులు, ప్రధాన నిందితునికి ముగిసిన కస్టడీ, రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితులు ఐదుగురు మైనర్లను నాలుగవరోజు కస్టడీలో పోలీసు అధికారులు దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఈక్రమంలో సోమవారం ఉదయం 12 గంటలకు జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషషన్‌కు తరలించి సాయంత్రం విచారణ ముగియడంతో తిరిగి మైనర్ నిందితులను జువైనల్ హోమ్‌కు తరలించారు. కాగా విచారణలో ఓ కార్పొరేటర్ కుమారుడే మొదట లైంగిక దాడికి పాల్పడినట్లు సీన్ రీకన్స్ట్రక్షన్‌లో గుర్తించిన పోలీసులు దానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా మైనర్లను ప్రశ్నించిన సమయంలో అత్యాచారానికి సంబంధించి ఒకరిపై, ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సాదుద్దీన్ రెచ్చగొట్టడంతోనే అత్యాచారం చేసినట్లు మైనర్లు చెప్పగా ప్రజాప్రతినిధి కుమారుడే మొదట అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తర్వాతే మిగతా వాళ్లం అత్యాచారం చేసినట్లు సాదుద్దీన్ పోలీసులకు వివరించారు.నాలుగవ రోజు విచారణలో ముఖ్యంగా మైనర్లను ప్రశ్నించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించారు. ఇదిలాఉండగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు తిరిగి చంచల్ గూడ జైలుకు 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు.
జూబ్లీహిల్స్ ఘటనలో ఓ కార్పొరేటర్ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్ కుమారుడు, ఎంఎల్‌ఎ కొడుకు పబ్‌లోకి ఎంటర్ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, ఈ నేపథ్యంలో పబ్‌లో డాన్స్ చేస్తున్న మైనర్ అమ్మాయిలను వేధించినట్లు కస్టడీలో వివరించాడు. ‘పబ్ నుంచి బయటకు వచ్చిన ఎంఎల్‌ఎ కొడుకు, కార్పొరేటర్ కొడుకు మైనర్ వెంట పడ్డారని, అయితే తాను వారిని వారించినట్లు సాదుద్దీన్ తెలిపాడు. ఎంఎల్‌ఎ,కార్పొరేటర్ కుమారులను వారించానన్న కోపంతో తనను బెంజ్ కారులో ఎక్కకుండా అడ్డుకున్నారని తెలిపాడు. తనను పబ్ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్ కారులో ఎక్కించుకున్నారని, దీంతో తాను బెంజ్ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరి వద్దకు వెళ్లినట్లు వివరించాడు. మైనర్ బాలిక బెంజ్ కారులోకి ఎక్కగానే ఎంఎల్‌ఎ కుమారుడు వేధించడం ప్రారంభించాడని, మార్గ మధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో అఘాయిత్యానికి ఒడిగట్టారని తెలిపాడు. తాను కేవలం ఫ్రెండ్స్ బలవంతం కారణంగానే ఆ అమ్మాయిని అత్యాచారం చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
నిందితుల పాత్రపై ఆరా..!
మైనర్ బాలిక అత్యాచారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది కస్టడీలో విచారణాధికారులు తేల్చారు. శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడు ఈ కేసులో అత్యంత కీలక సూత్రధారి అని అతని తరువాత సాదుద్దీన్, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే సోదరి కొడుకు, సంగారెడ్డి కార్పొరేటర్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ పబ్ కేసులోని నిందితుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఓ కార్పొరేటర్ కుమారుడు, సాదుద్దీన్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. సాదుద్దీన్ వల్లే విషయం బయటకు వచ్చిందని మిగతా నిందితులు దాడి చేశారు. ఈ పరిస్థితికి నువ్వంటే నువ్వే కారణమంటూ పరస్పర దూషణలు చేసుకున్నారు. మమ్మల్ని పబ్బుకు తీసుకెళ్లడం వల్లే వచ్చామంటూ ఓ మైనర్‌ను మరో ఇద్దరు మైనర్లు దూషించారు. అయితే బాలికను ట్రాప్ చేద్దామని సలహా ఇచ్చింది మీరేనంటూ మరో ఇద్దరిని మైనర్ బాలురు దూషించాడు. దీంతో పోలీసులు మైనర్లకు సర్ది చెప్పారు. కాగా పోలీసుల విచారణలోనూ మైనర్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సాదుద్దీన్ రెచ్చగొట్టడంవల్లే అత్యాచారం చేశామంటూ మైనర్లు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.