Thursday, December 26, 2024

ధరణిలో త్వరలో అందుబాటులోకి కరెక్షన్ మాడ్యూల్..

- Advertisement -
- Advertisement -

Correction module available soon in Dharani Portal 

ధరణిలో త్వరలో అందుబాటులోకి కరెక్షన్ మాడ్యూల్
 పరిష్కారం కానున్న డేటా ట్రాన్స్ ఫర్ ద్వారా తలెత్తిన సమస్యలు
 కరెక్షన్ మాడ్యూల్స్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి
 కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టాలా లేక జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలా అన్న దానిపై మధనం
 పద్దతి ఏదైనా అవినీతికి ఆస్కారం లేని విధానాన్ని ఎంచుకోవాలని ప్రభుత్వ భావన
 టెక్నికల్ ఎర్రర్స్ తొలగితే పెరగనున్న లావాదేవీలు

హైదరాబాద్: ధరణి పోర్టల్లో త్వరలో ఓ కరెక్షన్ మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. ఈ దిశలో రెవెన్యూశాఖ కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ఈ మాడ్యూల్ యాక్సెస్ ను కలెక్టర్లకు ఇవ్వాలా లేక జిల్లాస్థాయిలోనో, రాష్ట్రస్థాయిలోనో కమిటీలు ఏర్పాటు చేసి ఆ బాధ్యత వాటికి అప్పగించాలనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈ విషయంలో అవినీతికి ఆస్కారం లేని విధానాన్ని అవలంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరెక్షన్ మాడ్యూల్ అందుబాటులోకి వస్తే డేటా ట్రాన్స్ ఫర్ వల్ల భూయజమానులు, హక్కుదారుల పేర్లలో, సర్వే నంబర్లలో, భూవిస్తీర్ణంలో తలెత్తిన తప్పులు, కంప్యూటర్ రికార్డుల్లోని ఇతర అచ్చుతప్పులు సవరించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. తద్వారా పోర్టల్లోని అసౌకర్యం తొలగిపోయి క్రయవిక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

సులభంగా, సరళమైన పద్దతిలో, అత్యంత పారదర్శకంగా, అధికారులకు ఎలాంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా భూముల క్రయవిక్రయాలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తరవాత ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా భూలావాదేవీలు సాఫీగా సాగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం కావడంతోపాటు భూలావాదేవీల్లో అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండాపోయింది. ఐతే, సమగ్ర ప్రక్షాళన తరవాత వివిధ రకాల భూరికార్డులను ఐటీ శాఖ ధరణీ పోర్టల్లోకి బదలాయించింది. ఈ క్రమంలో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ తలెత్తాయి. ఇలాంటి సమస్యల అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వాటి పరిష్కారం కోసం కొన్ని సిఫారసులు చేసింది. పోర్టల్లో అదనంగా మరో ఏడు నుంచి ఎనిమిది మాడ్యూల్స్ తీసుకురావాలని సూచించింది. ఆమేరకు ప్రవేశపెట్టిన కొత్త మాడ్యూల్స్ తో కొన్ని ఇబ్బందులు తొలగిపోయాయి. కానీ భూ యజమానులు, హక్కుదార్ల పేర్లు, సర్వే నంబర్లు, భూవిస్తీర్ణం తదితర అంశాల్లో చోటు చేసుకున్న అచ్చుతప్పులు మాత్రం తొలగిపోలేదు. అలాంటి భూముల క్రయవిక్రయాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, ఫిర్యాదులు అందాయి. అన్ని కోణాల్లో దృష్టిసారిస్తూ ముమ్మరంగా కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో కరెక్షన్ మాడ్యూల్ ను ఇంట్రడ్యూజ్ చేయనుంది. డేటా బదలాయింపుతో తలెత్తిన ఈ సమస్యల పరిష్కార బాధ్యత ఎవరికివ్వాలనే దిశలో మధనం చేస్తోంది. ఈ వ్యవహారంలో జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించాలా లేక కలెక్టర్లకే ఆ అధికారాలను కట్టబెట్టాలా అని యోచిస్తోంది. ఏది ఏమైనా అవినీతి అక్రమాలకు తావులేని కచ్చితమైన విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. ఎక్కడ ఎలాంటి పద్దతిని అవలంభించాలి అనేదానిపై కూలంకషంగా చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ధరణి పోర్టల్లో ప్రభుత్వం కరెక్షన్ మాడ్యూల్ ను ప్రవేశ పెడుతుంది. అటు పొరపాటున నిషేధిత జాబితాలోకి వెళ్లిన 3 లక్షల ఎకరాల భూములను సైతం ప్రభుత్వం కలెక్టర్లకు అధికారాలిచ్చి ఆ జాబితా నుంచి తొలగించింది. కరెక్షన్ మాడ్యూల్ తో ధరణి పోర్టల్లో సమస్యలు దాదాపు సమసిపోతాయని సర్కారు భావిస్తోంది.

Correction module available soon in Dharani Portal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News