Thursday, January 23, 2025

‘కరప్ట్ కాంగ్రెస్ మోడల్.. కరెక్ట్ బిఆర్‌ఎస్ మోడల్’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను పోల్చుతూ ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి. ‘కరప్ట్ కాంగ్రెస్ మోడల్.. కరెక్ట్ బిఆర్‌ఎస్ మోడల్’ అంటూ పలువురు వాల్‌పోస్టర్‌లను అంటించారు. రైతు బీమా, ఉచిత కరెంట్, వికలాంగుల పింఛన్లు, దళితబంధు, రైతు బంధు వంటి సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌కు తెలంగాణకు మధ్య ఉన్న వ్యత్యాన్ని వాటిలో వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలకు, ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేదని ఆ పోస్టర్‌లలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళితులకు ఆర్థిక సాయం గుండుసున్నా
తెలంగాణలో దళితులకు ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు ఇస్తుండగా, హస్తం పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌ఘఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో గుండు సున్నా అని ఆ పోస్టర్‌లో వెల్లడించారు. దివ్యాంగుల పెన్షన్ విషయంలోనూ ఛత్తీస్‌ఘడ్‌లో రూ. 500, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.1300, కర్ణాటకలో రూ. 1100, రాజస్థాన్‌లో రూ. 1250లు ఇస్తుండగా తెలంగాణలో మాత్రం రూ.4116లుగా ఉందని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. వృద్ధాప్య పింఛన్ ఛత్తీస్‌ఘఢ్‌లో రూ.500లు, హిమాచల్‌ప్రదేశ్ రూ.750- నుంచి రూ.1250, కర్ణాటకలో రూ.1000, రాజస్థాన్‌లో రూ.1000- నుంచి రూ.1250 ఇస్తున్నారని, అదే తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2016 ఇస్తుందని పేర్కొన్నారు. ఛత్తీస్‌ఘడ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో రైతు బీమా పథకం లేదని, తెలంగాణలో రైతు చనిపోతే అతని కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తుందన్నారు. రైతు బంధు పేరుతో రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణలో ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తుండగా, ఛత్తీస్‌ఘఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయడం లేదన్నారు. ఇక తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తుందని, అదే ఛత్తీస్‌ఘఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా.. కరెంట్ కోతలతో సతమతం చేస్తున్నారని ఈ పోస్టర్లలో పేర్కొనడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News