మహారాష్ట్రను కొవిడ్‌తో పాటు సరికొత్త అవినీతి కుంభకోణం ఆరోపణ అట్టుడికించినట్టు ఉడికిస్తున్నది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఇటీవలే హోం గార్డు విభాగానికి బదిలీ అయిన ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ పేల్చిన అతిశక్తివంతమైన బాంబు పాలక శివసేన ఎన్‌సిపి కాంగ్రెస్ పార్టీల కూటమిని తీవ్ర ఇరకాటంలో పడవేసింది. వ్యవహారం మంచి క్రైం సినిమాను తలపిస్తున్నది. ముంబైలోని ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద బయల్పడిన పేలుడు పదార్థాల లారీ కేసులో గత 13వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అరెస్టు చేసిన అసిస్టెంట్ పోలీసు ఇన్స్‌పెక్టర్ సచిన్ హిందూరావ్ వాజేది ఈ కేసులో కీలక పాత్రగా కనిపిస్తున్నది. హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ముంబై మహానగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు వంద కోట్ల రూపాయలను వాజే ద్వారా వసూలు చేసే వాడని ఆరోపిస్తూ పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రేకి లేఖ రాయడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఒక హోం మంత్రి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరున్న కింది స్థాయి పోలీసు అధికారి ద్వారా ఇంత పెద్ద మొత్తం అక్రమ వసూళ్లు జరిపించడమనేది కేవలం సినిమాలలో మాత్రమే సాధ్యమవుతుంది. అయితే దేశం మొత్తం మీద పోలీసులకు వసూళ్ల బాసులు అని పేరున్న సంగతి తెలిసిందే.
ముంబైలో 1750 బార్లు రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలుంటాయని ఒక్కొక్క దాని నుంచి రూ. 2 3 లక్షల వరకు వసూలు చేసినా నెలకు 40 నుంచి 50 కోట్లు జమ అవుతాయని వాజేకి హోం మంత్రి వివరించి చెప్పారని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పరంబీర్ సింగ్ పేర్కొన్నారు. దీనితో దేశ్ ముఖ్ రాజీనామా కోసం డిమాండ్ పెరిగి పెద్దదయింది. జాతీయ స్థాయి నాయకుడుగా లబ్ధప్రతిష్ఠుడైన శరద్ పవార్‌కే అపఖ్యాతి అంటుకునే పరిస్థితి తలెత్తింది. ఈ ఆరోపణ తక్షణమే అధికార కూటిమికి మచ్చ తెచ్చిపెట్టింది. కాని దీని మూలాలను ఛేదించడం, నిజానిజాలను నిర్ధారించడం మామూలుగా అయితే అంత తేలిక కాబోదు. దీని వెనుక బలమైన హస్తాలు ఉంటేగాని ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వానికి ముప్పు రాదు. ఇందులో మొదటి విషయం అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు దర్యాప్తులో తీవ్రమైన అవకతవకల కారణంగా నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి తప్పించిన వెంటనే పరంబీర్ సింగ్ ఈ ఆరోపణ చేయడం, కమిషనర్‌గా ఉండగానే ఆయన అందుకు పాల్పడకపోడం.
అదే సమయంలో ముఖ్యమంత్రికి ఇ మెయిల్ ద్వారా పంపిన లేఖలో పరంబీర్ సింగ్ సంతకం లేకపోడం. అయితే ఆ మెయిల్ తాను పంపిందేనని ఆయన ఒప్పుకున్నారు. అంతేకాదు సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ పరువు కాపాడుకునే యత్నంలో శరద్ పవార్ ఇది తీవ్ర విషయమని ప్రకటించారు. హోం మంత్రి పై ఎటువంటి చర్య తీసుకుంటారో మీ ఇష్టమంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రేకు స్వయంగా లేఖ కూడా రాశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు నుంచి దృష్టి మళ్లించడానికే ఈ ఆరోపణ ముందుకు వచ్చిందన్నారు. ఆ కేసులో వాజేను ఎన్‌ఐఎ ఎందుకు అరెస్టు చేసిందో కారణాలు ఇంత వరకు బయటపడలేదు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తులో తీవ్రమైన లోపాలు బయటపడడం వల్లనే పరంబీర్ సింగ్‌ను బదిలీ చేసినట్టు హోం మంత్రి ప్రకటించగానే సింగ్ వంద కోట్ల వసూళ్ల ఆరోపణతో ముఖ్యమంత్రికి లేఖ రాయడం గమనార్హం.
ఒకవైపు వాజేను అరెస్టు చేసిన ఎన్‌ఐఎ, మరో వైపు పరంబీర్ సింగ్ దర్యాప్తు కోరిన సిబిఐ కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోని దర్యాప్తు సంస్థలు కావడం ఈ వ్యవహారం మూలాల పై అనుమానాలు కలిగించడం సహజం. మాఫీయా ముఠాలకు ఆది కేంద్రమైన ముంబై నగరంలో బయటపడిన కేసులు ఎటువంటివో తెలుసు. రాజకీయంగా గతంలో ఏక శరీరులుగా మెసులుకొని అధికారాన్ని కూడా పంచుకున్న బిజెపి, శివసేనలు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాలక పగ్గాల కోసం ఎటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు పన్నాయో తెలిసినవే. గత ఎన్నికల్లో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించినా ఈ సారి ముఖ్యమంత్రి పదవి తమకే చెందాలంటూ శివసేన భీష్మించుకోడంతో కాంగ్రెస్‌ను కూడా ఒప్పించి ప్రస్తుత ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పాటు కావడానికి శరద్ పవార్ విజయవంతంగా నడిపించిన చాణక్యం ఇక్కడ ప్రస్తావించుకోదగినది. రాజకీయ శత్రుత్వాలను తీర్చుకోడంలో అందు కోసం ఎటువంటి అప్రజాస్వామిక పన్నాగాలనైనా ప్రయోగించడంలో కేంద్ర పాలక పక్షానికి ఉన్న నేర్పు అపారమని పలు పరిణామాలు ఎత్తి చూపాయి. అందువల్ల ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు సాగుతుందో ఈ లోగా హోం మంత్రి పదవిని అనిల్ దేశ్ ముఖ్ కోల్పోవలసి వస్తుందో వేచి చూడాలి.