Thursday, January 23, 2025

బిజెపి రాష్ట్రాల్లో అవినీతి ప్రాజెక్టులు!

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని కరవ్‌ు నదిపై నిర్మించిన ప్రాజెక్టుకు గండిపడింది. ప్రాజెక్టుల నాసిరక నిర్మాణాలకు ఇది తాజా ఉదాహరణ. ఈ ప్రాజెక్టును ఇంత నాసిరకంగా నిర్మించడం వెనుక రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల హస్తముందని చాలా కాలంగా అందరూ అంటున్నదే. ‘అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంద’ ని ప్రధాని నరేంద్ర మోడీ గడిచిన ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు.

ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాని ప్రసంగించడం ఇది ఎనిమిదవసారి. అవినీతికి వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధాని ఈ విధంగా వివరించారు. “ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ, ఆధార్, మొబైల్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా గడిచిన ఎనిమిదేళ్ళలో రెండు లక్షల కోట్ల రూపాయల దేశ సంపద అక్రమార్కుల చేతిల్లోకి వెళ్ళకుండా కాపాడగలిగాం. గత ప్రభుత్వాల పాలనా కాలంలో బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని,వారిని వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. వారిలో కొందరిని జైళ్ళకు పంపిం చాం కూడా. దేశాన్ని దోచుకుని పారిపోయిన వారిని బలవంతంగానైనాసరే తప్పకుండా వెనక్కి తీసుకొస్తాం. సోదర సోదరీ మణుల్లారా, చెదపురుగుల్లా వీరీ దేశాన్ని తినేస్తున్నారు. ఒక నిర్మాణాత్మక దశకు చేరుకోవడానికి వీరికి వ్యతిరేకంగా నేను పోరాడాలి, ఆ పోరాటాన్ని వేగవంతం చేయాలి”. ఏదిఏమైనప్పటికీ, ప్రధాన మంత్రి చేసిన ప్రసంగంలో భారీ నీటి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులలో జరిగిన కుంభకోణాలు, అవినీతి గురించి మాత్రం ఎత్తలేదు.

దీనికి అనేక ఉదాహరణలున్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న మధ్యప్ర దేశ్‌లో లెక్కలేనంత మంది ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసిన అవినీతి ఇది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆగస్టులో కురిసిన వర్షాలకు కరవ్‌ు నదిపై నిర్మించిన ప్రాజెక్టు నిలబడలేకపోయింది. ఫలితం గా 18 గ్రామాలకు చెందిన పది వేల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేదని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీకి చెందిన ఎఎన్‌ఎస్ కన్‌స్ట్రక్షన్,గ్వాలియర్‌కు చెందిన సారథి కన్‌స్ట్రక్షన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టారు. అవినీతికి పాల్పడిందనే ఆరోపణపై ఇదే ఎఎన్‌ఎస్ కన్‌స్ట్రక్షన్ లైసెన్స్‌ను రద్దు చేసి, బ్లాక్ లిస్టులో పెట్టిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం, మళ్ళీ అదే సంస్థకు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఎలా అప్పగించింది? ఈ ప్రాజెక్టులో 113 కోట్ల రూపాయల పనిని ఎఎన్‌ఎస్ కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించింది. ఈ ఎఎన్‌ఎస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆ పనిని సారథి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి వంద కోట్ల రూపాయలకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం 342.50 కిలోమీటర్లు కాగా, 52 గ్రామాలకు తాగునీటిని, సాగునీటిని అందివ్వాలన్న ధ్యేయంతో దీనిని నిర్మించారు.

ఇవ్వన్నీ గిరిజన గ్రామాలే కావడం గమనార్హం. 344 కోట్ల రూపాయల పథకంలో భాగంగా 113 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించారు. వరద నీటితో నిండడానికంటే ముందు కరం ప్రాజెక్టు అవినీతితో నిండిపోయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతిపైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఆర్థిక నేరాల నిరోధక శాఖ) విచారణ జరుపుతోందని 2021లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాసన సభకు తెలిపింది. అవినీతి ఆరోపణలు వచ్చిన సారథి కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమాని బిజెపి సీనియర్ నేతకు సన్నిహిత మిత్రుడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆరోపించారు. టెండర్ ప్రక్రియలోనే కుంభకోణం బయటపడినప్పుడు ఆ కంపెనీ 93 కోట్ల రూపాయలను లంచంగా ఇవ్వచూపిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తప్పుపట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ సిపిఎం నాయకుడు జస్విందర్ సింగ్ ఆరోపించారు.

జగన్నాథ్ మిశ్రా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దశాబ్దాల క్రితం ఇరిగేషన్ మాఫియాను పోషించి, వ్యవస్థీకృతం చేశారు. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, ‘కోసినీళ్ళు మిశ్రా 200 కార్ల కాన్వాయ్‌కి పెట్రోల్‌గా ఉపయోగపడింది’ అని లాలూప్రసాద్ యాదవ్ తొలి విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నీటి పారుదల శాఖా మంత్రిగా పని చేసిన జగదానంద్ ఒకసారి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి, మరమ్మతులకు ఆ రోజుల్లోనే ఏడాదికి 250, 300 కోట్ల రూపాయలను వెచ్చించేవారు. ఆ నిధుల్లో 60 శాతం కాంట్రాక్టర్లకు, ఇంజినీర్లకు, రాజకీయ నాయకులకు వెళ్ళిపోయేది. వారి వారికి నిర్ణయించిన డబ్బుపోను మంజూరైన నిధుల్లో 25 శాతం కాంట్రాక్టరుకు వెళ్ళేది. ఆశ్చర్యమేమిటంటే 30 ఏళ్ళ తరువాత కూడా ఇందులో పెద్దగా మార్పులు ఏమీ లేవు. బీహార్‌లో ప్రతి ఏడాది వచ్చే వరదల ప్రభావానికి 80 లక్షల మంది ప్రజలు గురవుతారు. వరదలు వస్తున్నాయంటే ప్రజలు ఇప్పటికీ భయంతోనే బిక్కుబిక్కుమంటూనే ఉంటారు.

బీహార్ ప్రభుత్వం 202021లో వివిధ ప్రాజెక్టుల కోసం 1,353 కోట్ల రూపాయలను కేటియించగా, వరదల నివారణకు 440 కోట్ల రూపాయలను కేటాయించింది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నీటి ప్రాజెక్టులలో ఉన్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొన్ని సామాజిక సంస్థలు 2012లో ఉన్న టెండర్ ప్రక్రియలోనే లోపాలున్నాయని వెల్లడించాయి. ఫలితంగా నాలుగు ప్రాజెక్టు నిర్మాణం వ్యయం విపరీతంగా పెరిగిందని తెలిపాయి. అవి: కొంధనే ప్రాజెక్టు వ్యయం 56 కోట్ల రూపాయల నుంచి 328 కోట్ల రూపాయలకు, బాలగంగా ప్రాజెక్టు 420 కోట్ల రూపాయల నుంచి 1,320 కోట్ల రూపాయలకు, కలు ప్రాజెక్టు 640 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయలకు, షాయ్ ప్రాజెక్టు 410 కోట్ల రూపాయల నుంచి 1,139 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయంలో 22 శాతం లంచాలుగా ఇవ్వాల్సి వచ్చిందని 2014 లోనే మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పుణెకు చెందిన కాంట్రాక్టర్ లేఖ రాశాడు. ఈ లంచాలలో కింది స్థాయి గుమాస్తా నుంచి రాజకీయ నాయకుడి వరకు అందరికీ వాటా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇదే స్థితి

భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాపితంగా నీటిప్రాజెక్టుల నిర్మాణమంతా అవినీతితో నిండిపోయింది. ఇండోనేషియాలోని లెసోథోలో, థాయ్‌లాండ్, కెన్యాలలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి శిక్షణ ఉంటుందని, వాటిని స్వయం నిర్మితాలుగా తమ ఆధీనంలో పెట్టుకుంటున్నారని బెంజమిన్ కె. సోవాకూల్, గొడ్జ్ వాల్టర్ సమర్పించిన ఒక పరిశోధనా పత్రంలో స్పష్టం చేశారు. చైనాలోని త్రీ గాడ్జెస్ ప్రాజెక్టుల నిర్మాణంలో 50 మిలియన్ డాలర్ల నిధులను స్వాహా చేసినట్టు ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అర్జెంటీనా, పారాగుయె మధ్య చేపట్టిన యాక్రెటా డాం నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి, నిధుల దుర్వినియోగం వల్ల 2.7 బిలియన్ డాలర్లు అదనంగా వెచ్చించవలసి వచ్చిం ది.

చివరగా 2013లో మలేషియాలో సారవాక్ ఎనర్జీ అనే నార్వే కంపెనీకి 220 మిలియన్ల డాలర్ల విలువైన హైడ్రోపవర్ కాంట్రాక్టు అప్పగించారు. సారవాక ముఖ్యమంత్రి తాయిబా మొహమ్మద్ కుటుంబానికి చెందినదే ఆ కంపె నీ. ఆసియాలోనే అత్యంత అవినీతి రాజకీయ వేత్తగా తాయిబా మొహమ్మద్ గుర్తింపు పొందా డు. టెండర్లను అప్పగించడంలో చోటు చేసుకున్న అవినీతిని తెలుసుకొవాలంటే, నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకును పరిశీలించాలి, పునరావాసానికి నిధుల కేటాయింపుపై, రాజకీయ ప్రయోజనాలతో పెద్ద ఎత్తున కేటాయించే పనులపైన కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలి.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News