ఓ సీనియర్ నేత తాజా ఆఫర్ ?
బెంగళూరు : బిజెపి అధికారంలో ఉన్న కర్నాటకలో ముఖ్యమంత్రి పదవి రూ 2,500 కోట్ల ధర పలుకుతోంది. బిజెపి ఢిల్లీ అధిష్టానం తీరు తెన్నులతో పరిస్థితి ఈ విధంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ నేత బికె హరిప్రసాద్ విమర్శిచారు. తాను సిఎం పదవికి రూ 2500కోట్లు ఇవ్వగలనని ఓ సీనియర్ బిజెపి నేత ముందుకు వచ్చారని హరిప్రసాద్ తెలిపారు. ఇప్పటి సిఎం బస్వరాజ్ బొమ్మైను పార్టీ సిఎం పదవి నుంచి తప్పిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ దశలో పలువురు సిఎం పదవికి పోటీదార్లుగా రంగంలోకి వచ్చారని, వీరిలో ఎవరు ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే వారికే ఈ పదవి అనే రీతిలో బిజెపి నాయకత్వం ఆలోచిస్తోందని ఈ దశలో ఇప్పుడు సిఎం పోస్టు విలువ రూ 2500 కోట్ల వరకూ పోటాపోటీకి ఎదిగిందని తెలిపారు. రాష్ట్రంలో లింగాయత్‌ల కీలక నేత యడ్యూరప్పకు బిజెపి పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు.
ఆయనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం అయింది. ఈ దశలో ఆయన చెప్పిన వారికే సిఎం పదవి ఇస్తారని, రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని వెల్లడైంది. అయితే బస్వరాజ్‌ను మారుస్తారనేది కేవలం కట్టుకథ అని, ఇక సిఎం పదవికి పోటీ , భారీ స్థాయిలో డబ్బుల ప్రతిపాదనలు దుష్ప్రచారాల కిందికే వస్తాయని బిజెపి నేతలు స్పష్టం చేశారు. బస్వరాజ్ సారధ్యంలోనే కర్నాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లుతామని, ఆయనపై విశ్వాసం ఉందని తెలిపారు.