ఆశ, నిరాశల మధ్య పత్తి సేద్యం సాగుతూ వస్తున్నది. ఒక సంవత్సరం ధర ఆశను, ఆ తర్వాత రెండు సంవత్సరాలు రైతాంగంలో నిరాశను నింపుతున్నది. బయట మార్కెట్‌లో నిలకడలేని ధరలు, ఊరట నివ్వని మద్దతు ధరలు పత్తి సేద్యాన్ని, పత్తి రైతులను తీవ్ర సంక్షోభానికి గురి చేస్తూనే ఉంది. గత పత్తి సీజన్‌లో క్వింటాల్‌కు రూ. 10 నుంచి రూ. 12 వేల దాకా ధర లభించటంతో దిగుబడులు తగ్గినా రైతాంగానికి ఊరట లభించింది. ఫలితంగా ఈ సంవత్సరం ఆ ఆశతోనే ఆంధ్రప్రదేశ్‌లో 2.40 లక్షల హెక్టార్ల నుంచి 3.11 లక్షల హెక్టార్లకు పత్తి సేద్యం పెరిగింది. తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో సేద్యం జరిగింది. గత సంవత్సరం ఆగస్టు వరకు రూ. 10 వేలకు పైగా క్విటా పత్తికి ధర ఉంది. ఆ తర్వాత కొత్త పత్తి పంట రాగానే పత్తి ధర పతనం ప్రారంభమైంది. ఇందుకు కారణం బహిరంగ రహస్యమే. గత ఆగస్టుకు ముందు 90% పైగా రైతులు పత్తిని రైతులు విక్రయించారు. రైతుల వద్ద ఉన్న పత్తి వ్యాపారుల వద్దకు చేరిన తర్వాత దాన్ని విక్రయించడానికి వారు ధరను పెంచుతూ ఉంటారు. పోయిన ఆగస్టులో పత్తి రేటు పెరగటానికి అదే కారణం. గత అక్టోబర్ నుంచి రైతులు తిరిగి పత్తి పంట విక్రయాలను ప్రారంభించారు. వ్యాపారులు ధరలు తగ్గించటమూ ప్రారంభించారు. నేడు క్వింటా పత్తి ధర రూ. 6,800 నుంచి రూ. 7,500 వరకు ఉంది.
గత ఆగస్టు నుంచి రూ. 3 వేలకు పైగా ధర తగ్గింది. ఎకరా పత్తి సేద్యానికి రూ. 32 వేలకు పైగా రైతుకు ఖర్చు అవుతుంది. కౌలు రైతుకు అదనంగా మరో రూ. 20 వేలు ఖర్చు ఉంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు సగటు దిగుబడి 10 క్వింటాళ్ల వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా సగటు దిగుబడి తగ్గుతూ ఉంది. నకిలీ విత్తనాలు, తెగుళ్ల వలన ఈ సంవత్సరం 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాని పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 6,380 రూపాయలు. దీని ప్రకారం సొంత భూమి రైతుకు పెట్టుబడి వచ్చీరాని పరిస్థితి. కౌలు రైతులకు రూ. 20 వేలకు పైగా నష్టం. అమెరికా వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం ప్రపంచ పత్తి ఉత్పత్తి 128.2 మిలియన్ బేల్లు కాగా, ఈ సంవత్సరం 120.2 రెండు మిలియన్ బేల్లకు పరిమితమైంది. మిల్లుల వినియోగం 1,86,000 బేల్ల నుంచి 134.4 లక్షల బేళ్ళుగా ఉంది.
వస్త్రాలపై జిఎస్‌టి విధింపు వలన కొనుగోలు తగ్గి మిల్లులు ఉత్పత్తిని తగ్గించటమే అందుకు కారణంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పత్తి దిగుమతులు 46.4 మిలియన్ బేల్లు. చైనా దిగుమతి 2.5 మిలియన్ బేల్లు. ఈ సంవత్సరం భారత దేశంలో పత్తి ఉత్పత్తి తగ్గటం, మిల్లుల డిమాండ్ పెరగటంతో ఎగుమతులు తగ్గనున్నాయి. గత సంవత్సరం 78 లక్షల బేల్ల పత్తి ఎగుమతులు జరగగా, ఈ సంవత్సరం 40 లక్షల బేల్లకు తగ్గుతుందనే అంచనా వేస్తున్నారు. పత్తి కొనుగోలులో మిల్లులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధర తక్కువగా ఉంటే దిగుమతి చేసుకోవటం, ఎక్కువగా ఉంటే దేశంలోనే కొనుగోలు చేయటం అనే విధానం అనుసరిస్తున్నాయి. దేశంలో ధర తక్కువగా ఉన్నప్పుడు ఎగుమతులు ఆపాలని పాలకులపై వత్తిడి చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతుల విధానం రైతాంగానికి నష్టంగా మారింది.
2020 లెక్కల ప్రకారం ప్రపంచ పత్తి ఎగుమతుల్లో అమెరికా వాటా 35% కాగా, అక్కడ జరిగే ఉత్పత్తిలో 85% ఎగుమతి చేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో భారత దేశం లాంటి దేశాలు అమెరికాతో పోటీ పడలేకపోతున్నాయి. అందుకు కారణం అమెరికా అందిస్తున్న సబ్సిడీనే. అమెరికాలోని ఒక్కో పత్తి రైతుకు పరోక్షంగా ఇస్తున్న సబ్సిడీ 1,17,494 డాలర్లు. అమెరికా చట్టాల ప్రకారం మార్కెట్లో మద్దతు ధరకన్నా తక్కువ ఉంటే, ఆమేరకు ప్రభుత్వం లెక్కగట్టి రైతుకు చెల్లిస్తుంది. 1995 నుంచి 2020 వరకు 40.10 బిలియన్ డాలర్లు సబ్బిడీ రూపంలో చెల్లించింది.
రైతులకు జిన్నింగ్ ఖర్చులు తగ్గించే పేరుతో 3.16 బిలియన్ డాలర్లు అంద చేసింది. అమెరికా ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని 2003 నుంచి అనేక దేశాలు కోరుతున్నా అమెరికా లెక్కచేయటం లేదు. ప్రపంచ వ్యవసాయ ఒప్పందానికి ముందు 1986 -88లో ఉన్న సబ్సిడీల ఆధారంగానే ఇప్పటికీ అమెరికా సబ్సిడీలను లెక్కిస్తున్నది. ఈ కాలంలో తమ పత్తి సబ్సిడీ 2,384 మిలియన్ డాలర్లని, దాన్నే నేడు కూడా ప్రమాణంగా తీసుకోవాలని మొండి కేస్తున్నది. దీని ప్రకారం అదనంగా ఇచ్చిన 19 బిలియన్ డాలర్లను (గ్రీన్‌బాక్స్ పేరుతో) దాచిపెడుతున్నది. ఇది ప్రపంచ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకం. భారత దేశంలో రైతుకు ఇచ్చిన పరోక్ష సబ్సిడీ 27 డాలర్లు మాత్రమే. దీన్ని కూడా ఇవ్వగూడదని, రైతాంగానికి ఇస్తున్న సబ్సిడీని తగ్గించాలని అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత దేశంపై కేసులు వేశాయి. భారతదేశం దీన్ని ఎదుర్కొనలేకపోతున్నది.
అమెరికా ఇస్తున్న పరోక్ష సబ్సిడీలను బట్టబయలు చేయలేకపోతున్నది. ఆ దేశాలకు దాసోహమంటూ, వాటిని సంతృప్తి పర్చటానికి మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించటంలో మొండికేస్తున్నది. పంటల అమ్మకాలను బహిరంగ మార్కెట్‌కు అప్పగించేందుకు, కార్పొరేట్ సంస్థలకు రైతుల భూములను కట్టపెట్టేందుకు, వ్యవసాయాన్ని కార్పొరేట్లపరం చేసేందుకు మోడీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు, వీటికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమించటంతో వాటిని రద్దు చేసినా పరోక్షంగా వాటిని మోడీ ప్రభుత్వం అమలు చేస్తూనే ఉన్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోల్లను ఎఫ్‌సిఐ విరమించింది. ఇప్పుడు పత్తి కొనుగోళ్ల నుంచి సిసిఐ తప్పుకోనుంది. అందుకు బడ్జెట్ కేటాయింపే నిదర్శనం.బడ్జెట్‌లో కేటాయించిన లక్ష కోట్ల రూపాయలతో సిసిఐ కొనే పత్తి ఎంత, తెలంగాణలో ఇప్పటి వరకు సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో కోన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినా నామమాత్రపు కొనుగోల్లే. ఈ విధంగా పత్తి కొనుగోళ్ల నుంచి మోడీ ప్రభుత్వం తప్పుకోనున్నది. మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను యావన్మంది రైతాంగం అర్ధం చేసుకోవాలి. పత్తికి కనీస మద్దతు రూ. 10 వేలు ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించి, ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేయాలని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించాలి.
బొల్లిముంత
సాంబశివరావు
9885983526