Wednesday, December 25, 2024

సంక్షోభంలో పత్తి రైతు..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : మొదట్లో అధిక వర్షాలు దెబ్బతీస్తే, ఇప్పుడు పంటిన కాస్త పంటకు కూడా మార్కెట్‌లో కూడా గిట్టుబాటు ధర రాక రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మొదట్లో క్వింటాళ్లకు రూ.12ఏల నుంచి 15వేలు పలికింది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత సరుకు వస్తున్న కొద్దీ ధరలు పాతాళానికి చేరుకోవడంతో రైతులు అటు పంటను అమ్ముకోలేక, ఇటు పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చుకోలేక నలిగిపోతున్నారు. ముఖ్యంగా రైతుల వద్ద భూములను కౌలుకు తీసుకుని పత్తిసాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. వర్షాల దెబ్బకు రెండేసి దఫాలు విత్తనాలు నాటి, ఎరువులు వేస్తే ఒక్కొక్క ఎకరాపై రూ.15వేల నుంచి రూ.25వేల పెట్టుబడి వ్యయం అయింది. అయితే ఆరంభంలో క్వింటా పత్తి 15వేల ధర పలకడంతో కనీసం పెట్టుబడి అయినా తిరిగి వస్తుందని రైతులు ఆశించారు.

అయితే పంట చేతికొచ్చే సమయానికి ధరలు తగ్గడంతో పత్తిని విక్రయించాలా వద్దా అన్న మీమాంశలో కొట్టు మిట్టాడుతున్నారు. మరోవైపు సొంత భూమి కలిగిన రైతులు కూడా పత్తి పంట సాగు చేసిన ఎకరాకు రూ.15వేల పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఎకరాకు 12 నుంచి 14క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 6, 7 క్వింటాళ్లకే పరిమితమైంది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులను లెక్కేస్తే దిగుబడి, మార్కెట్‌లో ధరలు బేరీజు వేసి చూస్తే పెట్టుబడిలో మూడో వంతు కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ధరలు తగ్గుతుండడంతో ఈ పాటికే పూర్తి కావాల్సిన కొనుగోళ్లు కాస్త ఇప్పటికి ప్రారంభం కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్‌లో 11శాతం తేమ కలిగిన టాప్ క్వాలిటీ పత్తి ధర అత్యధికంగా రూ.8500 పలుకుతుండా 12 శాతం తేమకలిగిన పత్తి క్వింటాకు రూ.8వేలు, సీ గ్రేడ్ పత్తి రూ.7900 చొప్పున ధర పలుకుతోంది.

అయితే జిల్లాలో చాలా మటుకు రైతులు ఇండ్ల వద్దనే చిన్న చిన్న ట్రేడర్లకు కాంటా పెట్టి విక్రయిస్తుండడంతో దీన్ని అవకాశంగా మలుచుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు, నాణ్యతను సాకు చూపించి, రూ.7500 లోపే చెల్లిస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో రైతులు పత్తి నిల్వలను మార్కెట్‌కు తెచ్చి విక్రయించే సంప్రదాయం లేకపోవడం వల్లనే ధరల సమస్యను ఎరుర్కొంటున్నారు. అయితే ధరల తగ్గుదలతో ఆందోళనకు గురైతున్న రైతాంగం, జిల్లా అధికారులు కూడా దీనిపై దృష్టి సారించడం లేదన్నది రైతుల ప్రధాన ఆరోపణ. జిల్లాలో పండే పత్తి పంటే నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. మార్చి, ఏప్రిల్ నాటికి ధరలు ఎరగవచ్చనే అంచనాలు వ్యవక్తమవుతుండటంతో రైతులు పత్తిని విక్రయించేందుకు ముందుకు రావటం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News