Thursday, January 23, 2025

ఖమ్మంలో పొటెత్తిన తెల్లబంగారం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పత్తి పంట పోటెత్తగా, వరంగల్ జిల్లా, ఎనుమాములలో క్వింటాల్ పత్తి ధర రూ.6800కు అమాంతం పడిపోయింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నాలుగేళ్ళ తరువాత అత్యధికంగా సరుకు రావడం ఇదే తొలిసారి. దీపావళి పండగ ముంగిట్లో రైతుల అవసరాల నిమిత్తం ఒకేసారి పెద్ద ఎత్తున పత్తి విక్రయం కోసం మార్కెట్‌కు చేరడంతో వ్యాపారులు ఇదే అదనుగా ధరను తగ్గించి కొనుగోళ్ళు చేయడంతో రైతులు డీలాపడ్డారు. రెండు రోజుల సెలవు అనంతరం సోమవారం అంచనాలకు మించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు దాదాపు 40 వేల పత్తి బస్తాలు వచ్చాయి. గడిచిన కొద్దిరోజుల నుంచి రోజుకు ఐదు వేలు దాటని బస్తాలు సోమవారం మాత్రం అధికారుల లెక్కల ప్రకారం 30,680 బస్తాలు వచ్చాయి. దీపావళి పండగ నేపధ్యంలో రైతులంతా ఒకేసారి పత్తి బస్తాలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పత్తి బస్తాలను ఆన్‌లైన్ ద్వారా ఈనామ్‌లో బిడ్డింగ్ నమోదు సమయానికి 5 వేల బస్తాలు రాగా ఆ సమయంలో క్వింటాలు పత్తిని గరిష్ఠంగా రూ.6,800గా కోట్ చేశారు.

ఇ- బిడ్డింగ్ అనంతరం దాదాపు 35 వేల బస్తాలు అదనంగా రావడంతో వ్యాపారులు క్వింటాలు బస్తాను రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు కొనుగోళ్ళు చేయడం ప్రారంభించారు. గత కొద్ది రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండం, పంట చేతికి వచ్చే సమయం కావడం, సిసిఐ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థ్దాయిలో తెరుచుకోకపోవడంతో మార్కెట్ భారీగా పత్తి పంట చేరింది. తెల్లబంగారంతో పత్తి యార్డు కళకళలాడటం చూసిన ఖరీదుదారులంతా ఏకమయ్యారు. భారీగా పంట రావడంతో ధరను అమాంతం తగ్గించారు. క్వింటాలు ధర రూ.7 వేల నుంచి ఐదు వేలకు తగ్గించారు. ఇక వ్యాపారులంతా సిండికేటు కావడంతో సిసిఐ క్వింటాలు పత్తిని రూ.7,920 గా ఖరారు చేసింది. యార్డులోని నాలుగు ప్రధాన షెడ్లు, యార్డు ఆవరణ మొత్తం పూర్తిగా పత్తి బస్తాలతో నిండిపోయింది. ఇక్కడ స్థలం లేకపోవడంతో అపరాల యార్డులో కూడా దిగుమతి చేశారు. నిర్ణ్ణీతమైన తేమ శాతం ఉంటేనే ఆ ధరను చెల్లిస్తామని ప్రకటించారు. సిసిఐకి ఇంచుమించు దగ్గరలో మార్కెట్ ధర ఉంటుందనే ఉద్దేశంతో భారీగా రైతులు రాగా

వ్యాపారులంతా కుమ్ముక్కై ధరను అమాంతం తగ్గించడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. పండగ సమయంలో చేతిలో డబ్బులు లేకపోవడం, పత్తిని తీసిన కూలీలంతా వాళ్ళ డబ్బుల కోసం రైతులను వేధిస్తుండటంతో గత్యంతరం లేక రైతులంతా అడికి పావుశేరు చొప్పున విక్రయించక తప్పలేదు. ఆన్‌లైన్ బిడ్డింగ్ రేట్ కు, వాస్తవంగా చెల్లించే ధరకు భారీ వ్యత్యాసం ఉండటంతో కొందరు రైతులు వ్యాపారులను నిలదీశారు. ఇష్టం ఉంటే విక్రయించండి.. లేకుంటే వెనక్కి తీసుకెళ్ళండి అనే అనే సమాధానం రావడంతో విధి లేని పరిస్థితిలో రైతులు తమ సరుకును విక్రయించుకోవడం అనివార్యమైంది. వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి ధర రూ.6,800 పడిపోయింది. దీంతో రైతులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పత్తి దిగుబడి మొదలైన ప్రతిసారి ఇదే తంతు జరుగుతుందని రైతులు వాపోయారు. దీనికి కారణంగా దళారులు, వ్యాపారులు, మార్కెట్ నిర్వాహకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సిండికేట్‌గా మారి పత్తి ధరను వారికి నచ్చినట్లు మార్చుతూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు.

సోమవారం మార్కెట్‌కు వచ్చిన పత్తి తేమ అధికంగా ఉందని సిసిఐ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారస్థులు ధర ఒక్కసారిగా రూ.6,800 జెండా పాట నిర్ణయించారు. దీంతో రైతులు నిరసన వ్యక్తం చేయడంతో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల, సిబ్బంది రైతులకు, వ్యాపారులకు నచ్చచెప్పి తిరిగి విక్రయాలు సజావుగా జరిగేలా కృషి చేశారు. అనంతరం మార్కెట్‌లో క్రయ విక్రయాలు సజావుగా సాగాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News