Wednesday, January 22, 2025

తెలంగాణ ఖ్యాతి చాటిన తెల్ల బంగారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల్లో తెల్లబంగారం మరో సారి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. 2022-23కు సంబంధించి వాణిజ్య పంటల ఉత్పత్తిలో పత్తి పంటదే ప్రథమ స్థానంగా ఉంది. ఈ పంట సాగులోనూ, ఉత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలవగా , దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో మొ త్తం 53.25 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తిని సాధించి దేశంలోని పత్తి సాగు రాష్ట్రాల్లో తెలంగాణ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. దేశంలో జరిగే మొత్తం పత్తి పంట ఉత్పత్తుల్లో తెలంగాణ, మహారాష్ట్ర ,గుజరాత్ రాష్ట్రాలనుంచే 65శాతం పత్తి పంట ఉత్పత్తి జరుగుతుంది. గుజరాత్ ఈ సారి 91.83 లక్షల బేళ్ల ఉత్పత్తితో ప్రధమ స్థానంలో నిలుస్తుండగా , మహారాష్ట్ర 80.25లక్షల బేళ్ల ఉత్పత్తితో ద్వితీయ స్థానంలో నిలుస్తోంది.

దేశంలో పత్తిపంటను ప్రధానంగా మహారాష్ట్ర,గుజరాత్ , తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, హర్యాణ , ఆంధ్రప్రదేశ్ , మధ్యప్రదేశ్ ,పంజాబ్ , ఒడిశా, తమిళనాడు రాష్ట్రలే పండిస్తున్నాయి. దేశంలో 2020-21లో 352.48లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తికాగా, 2021-22లో 312.02లక్షల పత్తిబేళ్ల ఉత్పత్తి జరిగింది. గత ఏడాది పత్తి ధరలు ఏకంగా క్వింటాలు గరిష్టంగా 14వేలకు చేరింది. దీంతో ఈ సారి రైతులు పత్తిసాగు పట్ల మొగ్గు చూపారు. పంట దిగుబడి కూడా పెరిగింది. ఈ ఏడాది దేశంలో పత్తి ఉత్పత్తి గత ఏడాది కంటే భారీగా పెరిగిందని ప్రాధమిక అంచనాలమేరకు 341.91లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరగనున్నట్టు కేంద్ర ప్రభుత్వ జౌళిశాఖ సహాయమంత్రి దర్శన్ జర్ధోష్ లోక్‌సభలో ప్రకటించారు.
50లక్షల ఎకరాల్లో పత్తి సాగు
అంతర్జాతీయంగా పత్తి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో పత్తిసాగును భారీగా పెంచాలని రైతులకు పిలుపునిచ్చింది. సీజన్‌లో మొత్తం 70లక్షల ఎకరాల్లో పత్తిసాగును ప్రాధమికంగా అంచనా వేసింది. ఈ అంచనాలు కార్యరూపం దాల్చివుంటే తెలంగాణ రాష్ట్రం పత్తి సాగులోనే కాకుండా పంట ఉత్పత్తిలోకూడా గుజరాత్ , మహారాష్ట్రలను పక్కకు నెట్టివేసి జాతీయ స్థాయిలో ప్రధమస్థానంలో నిలిచివుండేది. అయితే సీజన్‌లో భారీ వర్షాలు కురవడం , ఎడతెరిపిలోనే వర్షాలతో నేల జోములెక్కి పత్తిసాగుకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో రా్రష్ట్రంలో పత్తిసాగు లక్ష్యాలకు బ్రేకులు పడింది. సీజన్ ముగిసే సరికి రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణం 50లక్షల ఎకరాలకు చేరుకుంది. గత ఏడాది జరిగిన 46లక్షల ఎకరాల విస్తీర్ణం కంటే ఈ సారి 4లక్షల ఎకరాల్లో విస్తీర్ణం పెరిగింది. నల్లగొండ, అదిలాబాద్ , ఆసిఫాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనే సుమారు 20లక్షల ఎకరాలకు పైగా పత్తిసాగు జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 30లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు జరిగింది.
40లక్షల బేళ్ల పత్తి ఎగుమతి
ఈ ఏడాది దేశంలో పండించిన పత్తిలో 40లక్షల బేళ్ల పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు కేంద్ర జౌళిశాఖ ప్రాధమిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. విదేశాలకు ఎగుమతి అయ్యే పత్తిలో అత్యధికశాతం తెలంగాణలో ఉత్పతి చేసినే పత్తికే ప్రాధ్యాన్యత ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేలల స్వభావం , భౌగోళిక పరిస్థితులు , వాతావరణం తదితర అంశాలన్ని పత్తిపంట సాగుకు అనుకూలంగా ఉండటం, ఇక్కడ పండించిన పత్తి పింజరకం ఎంతో నాణ్యతతో కూడినదైవుండటంతో జౌళివ్యాపార వర్గాలు తెలంగాణ పత్తికొనుగోళ్లకు జై కొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరల్లో పత్తికి క్వింటాలు పొడుగు పింజ రకం రూ.6380, మధ్యస్థరకం రూ.6080గా ప్రకటించింది.

అయితే మార్కెట్‌లో ఈ ఏడాది మద్దతు ధరలకంటే అధికంగానే ధరపెట్టి వ్యాపారులు పత్తికొనుగోలు చేస్తున్నార. అంతర్జాతీయంగా కూడా సీజన్ ప్రారంభంలోనే పత్తి క్యాండీ ధర. రూ.70వేలు, పత్తి క్వింటాలు గింజల ధర రూ.3200లు పలికింది. మార్కెట్‌లో పత్తి ధరలు ఈ సారి మరింత పెరిగే అవకాశలు ఉంటాయ్న ఆశాభావంతో రైతులు తాము పండించిన పత్తిని ధర పెరిగేదాక భద్రంగా నిలువ చేసుకునేందుకే మొగ్గుతున్నారు. దీంతో రాష్ట్రం మార్కెట్లలో పత్తి విక్రయాలు మందకోడిగానే సాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News