Thursday, January 16, 2025

మా ధర మేమే నిర్ణయించుకుంటాం

- Advertisement -
- Advertisement -

రామయ్య.. పొలం పనిమీద వెళ్తుండగా దారి మధ్యలో సోమయ్య తారసపడ్డాడు. సోమయ్య కోపంతో ఊగిపోతున్నడు. ఏంది ఎన్నడూ లేంది ఇయ్యాల సోమయ్య బాగా కోపంతో ఉన్నాడు. పలకరిస్తే పోలా.. అనుకుంటూ రామయ్య మెల్లగా సోమయ్యను తట్టాడు. ఏంది సోమయ్య ఎన్నడూ లేంది ఏదో పోగొట్టుకున్నోడిలా కోపంతో ఊగిపోతున్నావు. ఏం లేదే.. ఈ ఏడాది పంట పండిందని సంబరపడాలో.. బాధపడాలో తెలియక సతమతమవుతున్నా. మొన్న గవర్నమెంటు మాత్రం మద్దతు ధర ఇంత పెంచుతున్నామని చెప్పింది కదా.. అది అత్తెసరు పెంచి మందుల ధరలు, పురుగుల మందుల ధరలను కంపెనీలు పెంచేశాయి. అంతేనా ఇప్పుడు పత్తి చేతికొచ్చిందని ఏరిపిద్దామంటే కూలీలు కూడా కిలో పది.. పన్నెండు అంటూ ఆల్ల రేటు ఆల్లు చెబుతున్నారు.

దుక్కిదున్నడం నుండి పంట చేతికొచ్చే వరకు ఏటా ప్రతి పనికి రేట్లు పెరుగుతున్నాయి. కూలీలు కూడా వారి రేట్లు పెంచేస్తున్నారు. మరి నేనేందే..నేను పండించిన పంటకు ధర నిర్ణయించుకోలేకపోతున్నా. గవర్నమెంటు మాత్రం ఏదో మద్దతు ఇస్తున్నామని చెబుతున్నా ఇక్కడ మార్కెట్లో మాత్రం తేమ, తుక్కు, గూడు అంటూ నానా కొర్రీలుపెట్టి చివరకు ఇచ్చే ధర అంతంత మాత్రమే. ఇటు ధరలో కోత, అటు కూలీలకు, పురుగు మందులు, ఎరువులు ఇలా అన్నింటి ధరలు పెరిగినయి. చివరకు వడ్డీ వ్యాపారులు సైతం వడ్డీలు పెంచి నడ్డివిరగ్గొడుతున్నరే. ఇదంతా.. ఏటా ఉండేదే.. ఇప్పుడేందే ఇంత కోపంతో ఊగిపోతున్నావ్. ఏం లేదే.. మొన్న గవర్నమెంటు మన పంటకు మద్దతు ధర ఇంత అని ఏటా ఓ 500 పెంచేసి గొప్పగా ఏదో చేసినట్టు చెబుతున్నది. మరి అదే సినిమావోల్లు టిక్కెట్లు రేట్లు పెంచుకునేందుకు బెనిఫిట్ షోలు అంటూ రేట్లు పెంచేందుకు అనుమతిస్తోంది. అంటే ఆల్లు పడ్డకష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది.

అంటే సినిమావాళ్లలో కార్మికులు లేరా అంటావా.. ఉన్నరే. -కానీ వాళ్లపక్షాన ఎంబడే నిలబడే గవర్నమెంటు మన పక్కన ఎందుకు ఉండదంటా.. ఎందుకంటే అందులో ఉండేవాళ్లు పెద్దమనుషులని. ఆళ్లకు నష్టంవస్తే తట్టుకోలేరనే కదనే. అంటే మనది కష్టం కాదా.. అంతేనా.. మొన్న సబ్బుల ధరలు, చాయ్పత్తి ధరలు, నూనెల ధరలు పెంచేసినా.. మనం ఇబ్బందిపడి కొంటలేమా.. అంటే మన మీదనే కంపెనీలోళ్లకు నష్టాలొస్తాయని ధరలు పెంచుతున్నారు. మరి మనం పండించే పంటలకేమో ధర ఇయ్యరు. టమాట ఉత్పత్తులన్నీ అమ్మితే భారీగా ఆళ్లకు లాభాలొస్తాయి. మరి మనం అమ్మే టమాటకు రూపాయి, అర్ధ రూపాయి పెరిగితే లబోదిబో మంటారు. కూరగాయలు పండించే మనకేమో ధర లేదని అల్లాడితే వ్యాపారులేమో ధర పెంచి అమ్మినా పట్టించుకోరు. అంటే దళారులు, వ్యాపారులకేమో డబుల్ లాభాలు తీసుకున్నా ఎవరూ పట్టించుకోవట్లే. మనం ఏడాదంతా కష్టపడి పండించే పంటకు ధర దొరకడం లేదు. ఈ ఏడాది పత్తిపంట చేతికొచ్చిందనే లోపే వర్షాలు పడి తొలుత పంటంతా తడిసిపోయింది.

దీన్ని ఆసరా చేసుకుని మార్కె ట్లో వ్యాపారులు గూడు, తేమ పేరుతో ధర కోస్తున్నారు. సీసీఐ అధికారులు అధిక ధరచెల్లించి కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆల్లేమో తేమఅధికంగా ఉంటే ఏం చేయలేమని చేతులెత్తేయడంతో సగం పంట వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసినా. అందులో కూలీలు ఏరినందుకే సగం పైసలు పోయినయి. ఇక రెండోసారి ఏరిన పత్తికి కూలీల కొరత వల్ల కిలో పది.. పన్నెండు అంటూ ఆళ్లు ఇబ్బంది పెట్టినా సరే కూలీలే కదా అని ఆళ్లు ఇవ్వమన్న రేటు ఇచ్చి పత్తి ఏరిపిచ్చినా. మార్కెట్‌కు తీసుకెళ్తే సిసిఐ అధికారులు 12% తేమ ఉన్నా కొనడం లేదు. చివరకు అక్కడా ప్రయివేటు వాళ్లకు ఎంతకంటే అంతకు అమ్ముకోవాల్సి వచ్చింది. మన పంట మనమే అమ్ముకోలేకపోతే ఇక మనకు దిక్కెవరు. మనల్ని పట్టించుకోవాల్సిన గవర్నమెంటు పట్టించుకోవడం లేదు. అందుకే నేనే ఓ నిర్ణయానికొచ్చినా.. నా పంట నేనే అమ్ముకుంటా.. నా పంటకు నేనే ధర నిర్ణయించుకుంటా!

వామన్ మామిళ్ళ
99085 56358

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News