మనతెలంగాణ/హైదరాబాద్:రానున్న ఖరీఫ్ పం టల సీజన్‌కు సంబంధించి రాష్ట్రములో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో ప్రత్తి సాగు కాగలదని వ్యవసాయశాఖ అంచనా వేయగా, దానికి సరిపడా బిజి 2ప్రత్తి విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవల్సిందిగా వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 120లక్షల విత్తన ప్యాకేట్లను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2021లో 60.53 లక్షలు ఉన్న ప్రత్తి విస్తీర్ణము క్రమముగా తగ్గుతూ 2023లో 45.17 ల క్షలకు వచ్చిందనీ, ఐనప్పటికీ ప్రపంచ మార్కెట్లో ప్రత్తికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈసారి విస్తీర్ణము పెరిగే అవకాశముందని దానికి తగ్గట్లు బిజి 2విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోగా, ఈసారి 120 లక్షల ప్యాకెట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని,
ఇప్పటికే రెండు దఫాలు సంబంధిత అధికారులు, విత్తన కంపెనీలతో సమావేశం జరిపి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్రప్రభుత్వం ఈసారి బోల్‌గార్డ్ 2 ప్రత్తి విత్తన ప్యాకెట్ గరిష్ట ధరను రూ. 864.00 గా నిర్ణయించిదని, ఏ ఒక్క డీలరైనా, అంతకంటే ఎక్కువధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా విత్తన సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యను ఈ ప్రభుత్వం సహించబోదని, విధులపట్ల అలసత్వం వహించినా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసుకొని, ఎప్పటికప్పుడు అమ్మకాలను పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.