కాల్పుల విరమణ ఒప్పందంతో సత్ఫలితాలు : మీడియా నివేదిక వెల్లడి
ఇస్లామాబాద్ : భారత్‌పాకిస్థాన్ సరిహద్దుల నియంత్రణ రేఖ వెంబడి కొత్తగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ద్వైపాక్షిక సంబంధాలు క్రమేణా పురోగతి చెందుతాయని, భారత్ నుంచి పత్తి దిగుమతిని భూమార్గం ద్వారా పాకిస్థాన్ అనుమతించే అవకాశం ఉందని మీడియా నివేదిక ఆదివారం వెల్లడించింది. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో వచ్చిన సమాచారాన్ని ఉదహరిస్తూ పాక్ ప్రధాని వాణిజ్య సలహాదారు అబ్దుల్ రజాక్ దావూద్ భారత్ నుంచి పత్తి, నూలు దిగుమతి చేసుకునే విషయంపై వచ్చే వారం నిర్ణయం తీసుకోవచ్చని నివేదిక వెల్లడించింది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పాకిస్థాన్‌లో ఉత్పాదక వ్యయం తగ్గించడానికి, ఆహార సరఫరాలు స్థిరంగా ఉండడానికి దోహదపడతాయని నివేదిక వివరించింది. పాకిస్థాన్‌లో ఏటా 12మిలియన్ బేళ్ల పత్తిని వినియోగిస్తారు.
అయితే ఈ ఏడాది 7.7 మిలియన్ బేళ్ల పత్తి మాత్రమే పాక్‌లో అందుబాటుకానున్నది. అయితే పత్తి వ్యాపారులు 5.5 మిలియన్ బేళ్లు మాత్రమే ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈమేరకు 6 మిలియన్ బేళ్ల కొరతను తీర్చడానికి పాక్ ఇంతవరకు 6,88,305 మెట్రిక్ టన్నుల పత్తిని, నూలును దిగుమతి చేసుకుంది. దీనికి 1.1 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇంకా 3.5 మిలియన్ బేళ్ల కొరత కనిపిస్తోంది. అమెరికా, బ్రెజిల్, ఉజ్బెకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకోక తప్పదని వినియోగదారులు ఒత్తిడి తెస్తున్నారు. భారత్ నుంచి దిగుమతులు చాలా తక్కువ వ్యయంతో లభిస్తాయని ఆశిస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో భారత్ నుంచి పాక్‌కు దిగుమతులు చేరే అవకాశం కనిపిస్తోంది.