ప్రాచీన తమిళానికి జైకొట్టిన ప్రధాని
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఆదివారం నాటి మన్ కీ బాత్‌లో తమిళ భాష గురించి పదేపదే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష అయిన తమిళం తనకు రాదని, ఇందుకు తాను బాధపడుతున్నానని తెలిపారు. ఇంతకాలపు జీవితంలో ఏదైనా కోల్పోయ్యానని బాధపడుతున్నారా ? అనే ప్రశ్నకు తమిళం నేర్చుకోకపోవడం తనకు లోటని చెపుతానని మోడీ బాధ వ్యక్తం చేశారు. తమిళం ప్రాచీన భాష, తమిళ సాహిత్యం సమోన్నతం, అందమైన సజీవ భాష అని కొనియాడారు. భారత్ భిన్న సంస్కృతులు, బహుముఖ భాషల సమ్మేళనం అని ఇది దేశానికి అరుదైన గౌరవం ఆపాదించిందన్నారు.
మన్ కీ బాత్ ప్రారంభ దశలోనే ప్రధాని మోడీ విశేషించి తమిళ భాష గురించి ప్రస్తావిస్తూ రావడం ప్రధాన అంశం అయింది. క్రీడా పోటీలు జరిగినప్పుడు అత్యధిక భాషలలో కామెంట్రీలు ఇవ్వాలని కోరారు. వివిధ క్రీడలకు ప్రాంతీయ భాషలలో ఎందుకు సముచిత ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఉండరాదని ప్రశ్నించారు. ఈ మార్చిలో తన పరీక్షా పే చర్చ కార్యక్రమం ఉంటుందని, దీనికోసం తాను ప్రిపేర్ అవుతున్నట్లు , ఈ సందర్భంగా ఎగ్జామ్ వారియర్స్ అయిన విద్యార్థులు, అధ్యాపకులు , తల్లిదండ్రులు విరివిగా పాల్గొనాలని, ఈ విధంగానే తను ఈ పరీక్షలో నెగ్గినట్లు అవుతుందని ప్రధాని చమత్కరించారు.