శాసనసభ కోటా కింద తెలంగాణలో 6 ఎంఎల్‌సి స్థానాలకు, ఎపిలో మూడింటికి పోలింగ్
29 ఉ॥ 9 నుంచి సా॥4వరకు పోలింగ్, 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు 9న ఎన్నికల
నోటిఫికేషన్, 16వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన, ఉపసంహరణ గడువు 22
షెడ్యూల్‌ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 3 నాటికే పదవీ కాలం ముగిసిన
గుత్తా, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, నేతి విద్యాసాగర్, వెంకటేశర్లు, కడియం శ్రీహరి
మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ కోటా కింద తెలంగాణలో ఆరు ఎంఎల్‌సి స్థానాలకు, ఎపిలో మూడు ఎంఎల్‌సి స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. నవంబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అప్పటినుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. తెలంగాణ రాష్ట్రంలో గుత్తా సుఖేంద ర్‌రెడ్డి, మహ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత, నేతి విద్యాసాగర్, వెంకేటశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్ 3 వ తేదీ నాటికే ముగిసింది. అయితే కరోనా కారణంగా అప్పట్లో ఎన్నికలను నిర్వహించడం సాధ్యపడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బాగా తగ్గుముఖం పట్టడంతో రెండు రోజుల క్రితం హుజూరాబాద్ ఉపఎన్నికను కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎపిలో చిన్న గోవింద్‌రెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీ కాలం మే 31 నాటితో పూర్తి అయింది.