ఫలితాలు వెలువడి రెండు నెలలైనా
ప్రారంభంకాని ప్రవేశాల ప్రక్రియ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయ విద్యలో ప్రవేశాలకు వారంలో కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లాసెట్, పిజిఎల్‌సెట్ ఫలితాలు వెలువడి రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవడం పట్ల విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) నుంచి లా కాలేజీలకు అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే వారం రోజుల్లో లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి, బిసిఐ నుంచి కాలేజీలకు అనుమతులు వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదును ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు జులై 21, 22 తేదీలలో లాసెట్, పిజిఎల్‌సెట్ పరీక్ష నిర్వహించగా, ఆగస్టు 17వ తేదీన లాసెట్ ఫలితాలను ప్రకటించారు. మూడేళ్ల లా కోర్సుకు 15,031 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా,ఐదేళ్ల కోర్సుకు 4,256 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే పిజిఎల్‌సెట్‌కు 2,375 మంది ఉత్తీర్ణత సాధించారు.