Wednesday, January 22, 2025

ఎంఎల్ఎ వేధింపులు….. బిఆర్‌ఎస్‌కు, కౌన్సిలర్ పదవికి శ్రావణి రాజీనామా….

- Advertisement -
- Advertisement -

బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్న

ఎమ్మెల్యే స్వార్ధ పూరిత కుట్రకు బలయ్యాను

బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి బోగ శ్రావణి రాజీనామా.

జగిత్యాల : బాధాతప్త హృదయం తోనే తాను బిఆర్ఎస్ పార్టీని వీడవలసి వస్తుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసి గత నెల 25న మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ బోగ శ్రావని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, 37 వ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన తనకు ప్రజల నుండి, వివిధ సంఘాల నుండి ఎంతో మద్దతు, భరోసా లభించిందన్నారు. పక్క రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది ఎన్నారైలు తనకు నైతికంగా మద్దతు ఇచ్చారని, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత ఆహ్వానం మేరకు తాము బిఆర్ఎస్ పార్టీలో చేరామని, కెసిఆర్, కేటీఆర్ ల ఆశీర్వాదంతో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడి పని చేసి ప్రజల అభిమానాన్ని, సంపాదించానన్నారు. మూడు సంవత్సరాల పాటు జగిత్యాల పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని శ్రావణి తెలిపారు. పార్టీని నమ్ముకుని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. పార్టీ ఆదేశాల మేరకు పలు ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించామని తెలిపారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన తన భర్త కరోనాతో ఆసుపత్రి పాలయ్యారని గుర్తుచేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే స్వార్థపూరిత కుట్రకు ఒక బీసీ బిడ్డ, బహుజన మహిళ బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల కన్నా ఆత్మాభిమానమే ముఖ్యమని భావించి తాను మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశానే తప్పా పార్టీకి రాజీనామా చేయలేదన్నారు.

అయితే తాను నమ్మిన పార్టీ నుండి తనకు ఎలాంటి ఓదార్పు గాని, భరోసాగాని లభించలేదనే ఆవేదనతో తాను బాధాతప్త హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తాను బీఫామ్ ఇవ్వడం వల్లే మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యిందంటూ ఎమ్మెల్యే మాట్లాడడాన్ని భోగ శ్రావణి తప్పు పట్టారు. తాను ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యానని తెలిపారు. పార్టీ ద్వారా సంక్రమించిన 37 వ వార్డు కౌన్సిలర్ పదవి తోపాటు బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే వారిని, పార్టీలో ఉన్న కవితక్క మనుషులను కుట్రపూరితంగా పార్టీకి దూరం చేయాలని అనుకుంటున్న ఎమ్మెల్యే విజయం సాధించారని, అనుకున్నది సాధించిన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు అని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితక్కలపై తనకు అభిమానం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ L.రమణ గారికి, కౌన్సెలర్ల కి, పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేయడం పట్ల 37 వ వార్డు ప్రజలు తనను క్షమించాలని… మీ బిడ్డ అణిచివేతకు గురై ఆత్మాభిమానంతో రాజీనామా చేసిందే తప్పా…. ఎప్పటికి ప్రజల వెంటే తాను ఉంటానని ప్రజా సమస్యల కోసం ముందుండి పోరాడతానని భోగ శ్రావణి తెలిపారు. చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఎమ్మెల్యే అనుచరుల నుండి తనకు బెదిరింపు కాల్స్ మెసేజ్ లు వస్తున్నాయని, తన మద్దతుదారులను కూడా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుటుంబాన్ని అవమానపరిచే విధంగా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, ఇలాంటి చర్యలు మంచివి కావని తెలిపారు. ఎమ్మెల్యే వల్ల వేధింపులకు గురైంది తాను మాత్రమే కాదని తనతో పాటు ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు వేధింపులకు గురవుతూ పార్టీలోనే ఉన్నారని, కనీసం వారికైనా తగిన భరోసా కల్పించాలని పార్టీ అధినాయకత్వానికి భోగ శ్రావణి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News