మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో మజ్లిస్ పార్టీ బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ వంటి అవకతవకల పరిశీలన పూర్తయ్యే వరకు చాంద్రాయణగుట్ట, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును నిలిపి వేయాలని భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌కుమార్‌ను ఎఐసిసి సభ్యులు నిరంజన్ కోరారు. శనివారం ఆయన లేఖలో పేర్కొంటూ బోగస్ ఓటింగ్‌తో ఎన్నికలను కలుషితం చేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై ఎంఎంఐ కార్యకర్తలు దాడులు చేశారని పేర్కొన్నారు. మజ్లిస్ మినహా ఇతర పార్టీ ఏజెంట్లను పోలింగ్ స్టేషన్‌లలోకి రాకుండా అడ్డుకుని ఇష్టానుసారం బోగస్ ఓటింగ్‌కు పాల్పడిందన్నారు. వారి అరాచకాలతో సంబంధిత అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపించారు.
ఈ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లలో ఏర్పాటు చేసిన అన్ని వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలను తనిఖీ చేసి నిందితుల పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ ఓటింగ్ ఎలా జరిగాయో తెలుసుకోవడానికి వెబ్, సిసి కెమెరాల తనిఖీ పూర్తయ్యే వరకు ఆరెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును పక్కన పెట్టాలని అభ్యర్థించారు. వీటిలో అవసరమైతే రీపోలింగ్ జరపాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా పోలింగ్ జరగాలంటే ఇది చాలా అవసరమన్నారు.