Friday, January 17, 2025

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది

- Advertisement -
- Advertisement -

ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది
: మంత్రి సీతక్క వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని, ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క అన్నారు. విద్యార్థులను సంరక్షించేందుకు ప్రభుత్వం నుంచి మీరు వేతనాలు అందుకుంటున్నారు, విద్యార్థులను ప్రయోజకులను చేసే బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఉందని తెలిపారు. సరూర్‌నగర్‌లోని సంక్షేమ గురుకుల లా కాలేజీలో గురువారం జరిగిన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ గురుకులాల ప్రిన్సిపల్స్, సిబ్బందితో తాను సమావేశం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడే గురుకులాలు గొప్పగా ఉన్నట్లు భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు. కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు దురదృష్టకర ఘటనల మీద రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పులు సోషల్ మీడియాలో పెట్టి విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గురుకులల్లో పదేళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామని వివరించారు. హాస్టల్ జీవితం చాలా అద్భుతమని చెప్పిన సీతక్క తాను ములుగులో ఎస్టీ గరల్స్ హాస్టల్లో నాలుగు నుంచి పదో తరగతి వరకు చదువుకున్నానని అన్నారు. తాను నిత్య విద్యార్థినని, ఎల్‌ఎల్బి, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్డీ పూర్తి చేశానని చెప్పారు. మరో పిజి కోర్సు చేసేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు. విద్యకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. అందుకే మెస్ చార్జీలను పెంచి, మెను పక్కగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పోషకాహారాన్ని అందజేయాలని అన్నారు.

గురుకులాల్లో ఐఏఎస్‌లు నిద్ర చేసేలా చర్యలు చేపట్టాము

రాష్ట్రంలో గురుకులాల్లో ఐఏఎస్ అధికారులు నిద్ర చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత ప్రిన్సిపాల్సే పిల్లల బాధ్యత తీసుకోవాలని సూచించారు. మీరు విద్యను పంచడం ద్వారా లక్షలాది మంది ప్రయోజకులై ఈ దేశ నిర్మాణంలో భాగం పంచుకుంటారని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకు విద్యా హక్కును ప్రసాదించారని అన్నారు. బయట లక్షలు పెట్టిన కొనలేని విద్యను గురుకులాల్లో మన ప్రభుత్వ అందిస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం హాస్టళ్లను సందర్శిస్తున్నానని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు పదోన్నతులు పూర్తి చేసామని, సకాలంలో జీతాలు ఇస్తున్నామని చెప్పారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా టీచర్స్ డేగా ప్రకటించి మహిళా టీచర్ల గౌరవాన్ని పెంచామని అన్నారు. జ్ఞానం అనేది తరగని గని చెబుతూ టీచర్లు నిత్య విద్యార్థుల్లా జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులను వజ్రాలుగా తీర్చిదిద్దాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News