తేజ్‌పూర్ (అస్సాం) : రానున్న మూడు సంవత్సరాలలో దేశం నుంచి నక్సలిజం బెడదను నిర్మూలించనున్నట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం ఉద్ఘాటించారు. తేజ్‌పూర్ సమీపంలోని సలోనిబరిలో సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) 60వ అవతరణ దినోత్సవం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు (సిఎపిఎఫ్‌లు) అన్నిటిలోకి ఎస్‌ఎస్‌బి సరిహద్దు గ్రామాలలో ‘సంస్కృతి, ప్రాంతాలు, భాషను సమీకృతం చేయడంలో విలక్షణ పాత్ర’ పోషిస్తోందని, ఆ ప్రాంతాల ప్రజలను దేశంలోని తక్కిన ప్రాంతాలకు సన్నిహితంగా తీసుకువస్తున్నదని చెప్పారు.
సరిహద్దులను కాపలా కాయడంతో పాటు ఇతర సిఎపిఎఫ్‌లతో పాటు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లలో నక్సలైట్లకు వ్యతిరేకంగా సమర్థంగా విధులు నిర్వహిస్తున్నదని మంత్రి కొనియాడారు. ‘వచ్చే మూడు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం నక్సల్ సమస్య నుంచి నూటికి నూరు శాతం విముక్తం అవుతుంది’ అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆరుగురు ఎస్‌ఎస్‌బి సిబ్బంది విశిష్ట సేవకు గాను అవార్డులను, మూడు బెటాలియన్లకు ట్రోఫీలను బహూకరించడంతో పాటు హోమ్ శాఖ మంత్రి ఈసందర్భంగా ఒక పోస్టేజ్ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.