ప్రధాని మోడీ చర్యపై రాహుల్ విసుర్లు
న్యూఢిల్లీ: దేశంలో 2016 నవంబర్ 8 నాటి పెద్దనోట్ల రద్దు ప్రహసనంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ రాచరిక నియంతృత్వ చర్య దేశ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలగచేయడమే కాక దేశం ఈ వేదనను ఎన్నటికీ మరువబోదని రాహుల్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు పేరిట 2016 నవంబర్ 8న ప్రజలను రోడ్లపైన క్యూలైన్లలో నిలబెట్టారని హిందీలో రాసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాహుల్ పేర్కొన్నారు. తమ సొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, చాలా మంది ఇళ్లలో పెళ్లిళ్లు ఉన్నాయని, పిల్లలు, వృద్ధులు చికిత్స పొందుతున్నారని, గర్భిణి స్త్రీలు ఉన్నారని, కాని&ఎవరి దగ్గరా చిల్లిగవ్వ లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. డబ్బు విత్‌డ్రా చేసుకకోవడానికి గంటల కొద్దీ లైన్లలో నిలబడి చాలామంది ప్రాణాలు కోల్పోయారని కూడా ఆయన గుర్తు చేశారు. 2016లో రూ. 18 లక్షల కోట్లు చెలామణిలో ఉండగా ప్రస్తుతం రూ. 31 లక్షల కోట్లు చెలామణిలో ఉందని ఆయన తెలిపారు. మీ డిజిటల్ ఇండియా, నగదురహిత ఇండియా ఏమైందంటూ ప్రధాని మోడీని రాహుల్ ప్రశ్నించారు.