మన తెలంగాణ / హైదరాబాద్ : క్రీడారంగం తో పాటు అన్ని రంగాల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. అన్ని రంగాల్లో ఉపాధి భవితకు కేంద్రంగా మారిన తెలంగాణ వైపు యావత్ దేశ యువత చూస్తోందని అన్నారు. గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో ఆదివారం జరిగిన 76వ సీనియర్ జాతీయ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎంఎల్‌ఏ అరికెపూడి గాంధీతోకలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్నవారిని గుర్తించి ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. గత తొమ్మిదేళ్ల నుండి కెసిఆర్ ప్రభుత్వం క్రీడల ప్రతిభను గుర్తించి అన్ని విధాలుగా క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతతో నూతన ఆవిష్కరణలకు అద్భుతమైన అవకాశాలు తెలంగాణలో లభిస్తున్నాయన్నారు. ఆయన అన్నారు. క్రీడాకారుల భవిష్యత్తు బాగుండాలని యువ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలని ఉద్దేశంతో క్రీడాకారులకు రిజర్వేషన్లు, భారీగా నగదు ప్రోత్సాహకాలు, ఇళ్ల స్థలాల కేటాయింపుతోపాటు అనేక క్రీడా ప్రోత్సాహక విధానాలు అవలంబిస్తుందని ఆయన అన్నారు. దాదాపు 17 వేల గ్రామాలలో నిర్మించిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు 78 నియోజకవర్గాల్లో నిర్మించిన స్టేడియాలు వివిధ స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఉన్న క్రీడా మైదానాలు ,స్టేడియాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి సిఎం కెసిఆర్ సూచనల మేరకు “చలో మైదాన్” కార్యక్రమాన్ని చేపట్టి యావత్తు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్‌ఎండిసి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్వముఖర్జీ, ఆల్ ఇండియా స్విమ్మింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర నానావతి, జనరల్ సెక్రెటరీ మోనాల్ చోక్సి ఒలంపిక సోషల్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్,తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, ఉమేష్ గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొండా విజయ్ కుమార్ సమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.