కరోనా రోగుల బంగారం చోరీ చేస్తున్న దంపతులు
ముత్తూట్‌లో తాకట్టు, వచ్చిన డబ్బులతో జల్సాలు
టిమ్స్‌లో పేషంట్ కేర్‌గా పనిచేస్తున్న నిందితులు
అరెస్టు చేసిన గచ్చిబౌలి పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా రోగుల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేస్తున్న దంపతులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16తులాల బంగారు ఆభరణాలు, 80తులాల వెండి కడియాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో చింతలపల్లి రాజు, చింతలపల్లి లతాశ్రీ పేషంట్ కేర్‌గా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా, ధర్మపురికి చెందిన రాజు మొదటి భార్యను వదిలేసి నగరానికి వచ్చి బతుకుతున్నాడు.
2017లో కూకట్పల్లి, రాజీవ్ గృహకల్పలో ఉంటున్న లతాశ్రీతో పరిచయం ఏర్పాడింది. ఇద్దరి మధ్య సన్నిహతం ఏర్పడడంతో వివాహం చేసుకున్నారు. లతాశ్రీ టిమ్స్‌లో అవుట్ సోర్సింగ్‌లో పేషంట్ కేర్‌గా పనిచేస్తుండడంతో రాజును కూడా ఉద్యోగంలో పెట్టించింది. టిమ్స్ పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రి కావడంతో కరోనా రోగులు స్పృహ లేని వారు, మృతిచెందిన వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఇద్దరు కలిసి చోరీ చేస్తున్నారు. వాటిని ముత్తూట్ ఫైనాన్స్, స్థానిక జూవెల్లరీ షాపుల్లో కుదువ బెట్టి డబ్బులు తీసుకుని జల్సాలు చేస్తున్నారు. ఇద్దరిపై ఏడు కేసులు నమోదు చేశారు. గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, బాలనగర్ సిసిఎస్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Couple arrested for stolen gold from corona patient