కోనరావుపేట: తమ భూమిని అధికారులు లాక్కొంటున్నారని ఆవేదన చెందిన దళిత రైతు దంపతులు పురుగుల మందు తాగారు. వివరాల్లోకి వెళ్తే&రాజన్న సిరిసిల్ల్ల జిల్లా.. కోనరావుపేట మండలం.. కొండాపూర్ గ్రామానికి చెందిన మాల్యాల నందం జనశక్తి నక్సల్స్ సానుభూతిపరుడిగా పని చేశాడు. అప్పటి ప్రభుత్వం రెవెన్యూ అసైన్డ్ భూమి సర్వే నంబర్ 116 లో 1 ఎకరం 20 గుంటల భూమిని అప్పటి తహశీల్దార్ ఇచ్చారు. ఈ భూమిని సేద్యం చేస్తూ భార్య పద్మ,ఇద్దరు కూతుర్లు, కుమారుడిని పోషించుకుంటున్నాడు. 2021 సంవత్సరంలో మండలంలోని మల్కాపేట రిజర్వాయర్, కెనాల్ నిర్మించడంతో అందులో అటవీ భూమి పోవడంతో ప్రత్యామ్యాయంగా కొండాపూర్ గ్రామంలో ఉన్న రెవెన్యూ భూమిని అటవీ శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఉన్నాయని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు నందం భూమి వద్దకు వచ్చారు.
హద్దులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో దళితులమైన తమకు ఈ భూమే ఆధారమని, దీనిని లాక్కోవద్దని, తన ఇద్దరు బిడ్డలు, కొడుకు దిక్కులేని వారవుతారని అధికారులను వేడుకొన్నా వినలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పొలంలోనే నందం, భార్య పద్మ పురుగుల మందు తాగారు. దీనిని గమనించిన అధికారులు, స్థానికులు వారిని హుటాహుటిన వారిని సిరిసిల్ల్ల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా, దళితులకు ఉన్న కాస్త ఎకరం భూమి ప్రభుత్వ అధికారులు లాక్కోవడం సరికాదని, అటవీశాఖకు కేటాయించిన దళితుడి భూమిని వెంటనే జిఓ రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై కోనరావుపేట తహశీల్దార్ విజయ ప్రకాశ్ రావును వివరణ కోరగా ..ఇది 2021లో జరిగిన కేటాయింపు అని, తాను చేసింది కాదని, దీనిపై కలెక్టర్‌కి నివేదిక పంపిస్తామని అన్నారు. అయితే, ఆత్మహత్యా యత్నం సరికాదని, సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.