Monday, January 20, 2025

బాలుడి వైద్య ఖర్చుల కోసం అజ్ఞాత దాత రూ. 15.31 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

 

 

ముంబై: అత్యంత అరుదైన వ్యాధితో బాధపుడుతున్న ఒక 16 నెలల కుమారుడికి అవసరమైన మందుల కోసం ఒక అజ్ఞాత దాత రూ. 15.31 కోట్లు దానం చేశాడు. మనుషుల్లో మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని రుజువు చేసే ఈఅపూర్వ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. ముంబై నుంచి ఇటీవలే కేరళకు బదిలీపై వచ్చిన సరంగ్ మీనన్ మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య అదితి నాయర్. ఈ దంపతుల 16 నెలల కుమారుడు నిర్వాణ్‌కు అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రాఫీ(ఎస్‌ఎంఎ) టైప్ 2 వ్యాధి ఉన్నట్లు బయటపడింది. ఈ వ్యాధి చికిత్స కోసం ఒకసారి మాత్రమే ఉపయోగించే మందు ఖరీదు రూ. 17.3 కోట్లు ఉంటుంది. అంత ఖరీదైన వైద్యాన్ని భరించే ఆర్థిక పరిస్థితి మీనన్ దంపతులకు లేదు. మిలాప్.ఓఆర్‌జిలోదాతల నుంచి విరాళాల సేకరణను ఆ దంపతులు చేపట్టారు.

అయితే ఒక అజ్ఞాత దాత నుంచి ఏకమొత్తంలో 1.4 మలియన్ డాలర్లు(భారతీయ కరెన్సీలో రూ. 15.31 కోట్లు) అందినట్లు అదితి నాయర్ తెలిపారు. దాతల నుంచి విరాళాల సేకరణ లక్ష్యాన్ని రూ. 17.50 కోట్లుగా మీనన్ దంపతులు నిర్దేశించుకోగా ఒకే వ్యక్తి నుంచి అంత మొత్తం విరాళంగా లభించడం విశేషం. తాము పెట్టుకున్న లక్షంలో అధిక భాగం ఒక వ్యక్తి నుంచి రావడం చాలా సంతోషంగా ఉందని, మిగిలిన మొత్తాన్ని బంధువులు, మిత్రుల నుంచి సేకరిస్తామని అదితి నాయర్ తెలిపారు. అమెరికా నుంచి ఆ మందు ముంబై రావడానికి మరో మూడు వారాలు పడుతుందని, ఈలోపల ముంబైలో తమ పిల్లాడికి తదుపరి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఆ మందును దిగుమతి చేసుకోవడానికి అనుమతి కోరుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు, దిగుమతి, ఎగుమతి శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. నిర్వాణ్‌కు ముంబైలోని హిందూజా ఆసుపత్రికి చెందిన పీడియాట్రిక్ న్యూరాలజిస్టు డాక్టర్ నీలు దేశాయ్ చికిత్స అందచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News