Monday, December 23, 2024

ఖైదీలకు ‘సంసార సుఖం’ సాధ్యమా?

- Advertisement -
- Advertisement -

జైలు శిక్ష పడ్డవారు కుటుంబాలకు దూరంగా బతకవలసి వస్తుంది. మూడు నెలలకోసారి ములాఖత్ పేరిట కళ్ళతో పలకరించుకొని, ఫోను మాధ్యమంగా మాట్లాడుకోవలసిందే. కొత్తగా పెళ్లయినవారిలో ఒకరికి అనుకోకుండా ఏళ్ల తరబడి జైలు లో బతకవలసి వస్తే అంతకన్నా పెద్ద శిక్ష ఏదీ ఉండదు. ఇలా జైలు ఖైదీలను దాంపత్య సౌఖ్యానికి దూరం చేయడాన్ని శిక్షలో భాగంగా భావించాలా లేదా ఇద్దరిలో ఒకరికి వేసిన శిక్షను బయట ఉన్న జీవిత భాగస్వామి లైంగిక సుఖానికి దూరమై చేయని నేరానికి వేయని శిక్షగా అనుభవించాలా అనేది మన చట్టాల ముందున్న పెద్ద ప్రశ్న. దీనికి అనుగుణంగా, సానుకూలంగా జైలు నియమావళిని మార్చాలని అప్పుడప్పుడు న్యాయమూర్తులు ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నా పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు పడకపోవడం సామాజిక నిర్లక్ష్యంగానే భావించాల్సి వస్తోంది.
1978 లోనే సునీల్ బాత్రా కేసులో జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పు చెబుతూ జైలు శిక్ష రాజ్యాంగంలోని పార్ట్ III లో పొందించిన పౌరుల ప్రాథమిక హక్కుకు భంగకరంగా ఉండరాదని పేర్కొన్నారు. జైలులో ఆలుమగల శారీరక కలయికలకు అనుమతి ఇయ్యడం వల్ల ఎన్నో మానసిక, సామాజిక లాభాలున్నాయి. కావున ఖైదీలు జీవిత సహచరులను కలిసే అవకాశాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలని ఆయన సూచించారు. ఇదే విషయంలో జనవరి, 2015 లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ ఒక సంచలన తీర్పు ఇచ్చారు. 16 ఏళ్ల బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందిత దంపతులైన జస్వీర్ సింగ్ , సోనియా పాటియాలా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అరెస్టయేనాటికి వారికి పెళ్లయి ఎనిమిది నెలలు మాత్రమే అయింది. జస్వీర్ సింగ్ తన తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. తమ వంశం కొనసాగింపుగా తమకు పిల్లలు కావాలని కోరుకుంటున్నాము. ఇది మా లైంగిక కోరిక తీర్చుకోవడానికి కాదని, పెద్దల ఆకాంక్ష కోసమే అని పేర్కొంటూ అందుకు తగిన సదుపాయాలు జైలులో కల్పించేలా జైలు అధికారులకు ఆదేశించాలని ఆ దంపతులు కోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి వారి విన్నపము రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్చకు సంబంధించినదని, వారి కలయిక కోసం లేదా వారిరువురి ప్రమేయంతో కృత్రిమ గర్భధారణకైనా అనుమతినీయాలని తీర్పు చెప్పారు.
జనవరి, 2018లో కూడా మద్రాస్ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునిచ్చింది. జస్టిస్ విమలాదేవి, జస్టిస్ కృష్ణవల్లిలతో కూడిన డివిజనల్ బెంచ్ పిల్లలను కనేందుకు దంపతుల కలయిక తప్పనిసరి, అది వారి ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ తిరునల్వేలి సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న 40 ఏళ్ల సిద్దిఖీ అలీ అభ్యర్థన మేరకు ఆయన రెండు వారాలపాటు భార్యతో కలిసి ఉండేందుకు అనుమతిని ఇచ్చింది. నిజానికి కారాగార వాసికి జీవిత భాగస్వామితో దాంపత్య సౌఖ్యాన్ని అనుమతిస్తూ జైలులోనే ఆ సదుపాయాలు కల్పిస్తే ఖైదీల ఆలోచనా సరళిలో మార్పు వచ్చి శాంత స్వభావులవుతారని, సామాజిక, కౌటుంబిక బాధ్యతలు గుర్తెరిగి నేరప్రవృత్తి తగ్గి, చేసిన తప్పుకు పశ్చాత్తాపం కూడా కలుగుతుందని మానసిక నిపుణుల అభిప్రాయం.
మన దేశంలో కోర్టు ఉత్తర్వుల ద్వారా కొంత మంది ఖైదీలే ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. జైలు మాన్యువల్ లో దీని ప్రస్తావన లేనందువల్ల జైలు అధికారులు ఈ సదుపాయం కోర్టు ఉత్తర్వులు మినహా కోరిన వారందరికీ కల్పించలేరు. ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా జైలు నియమావళిలో దీనిని పొందుపరిస్తే మాత్రం కోర్టును ఆశ్రయించకుండానే యోగ్య ఖైదీలు దీనిని అనుభవించవచ్చు. 1983 లో జస్టిస్ ముల్లా నేతృత్వంలో జైళ్ల సంస్కరణ కమిటీ నివేదికలో పేర్కొన్న 658 సూచనల్లో , 1987 లో వచ్చిన మహిళా ఖైదీల స్థితిగతులపై జస్టిస్ కృష్ణ అయ్యర్ రిపోర్టులోనూ ఖైదీల ప్రాథమిక, మానవ హక్కులను కాపాడాలని ఉంది. ప్రభుత్వం వాటి అమలుకు ముందుకొస్తే ఖైదీల దాంపత్య జీవితం చుట్టూ ఉన్న సమస్యలు కూడా తీరవచ్చు.
ప్రపంచంలో చాలా దేశాలు ఖైదీల దాంపత్య జీవితానికి అడ్డు రాకుండా వివిధ రకాల మార్గాలు పాటిస్తున్నాయి. ఇప్పటికే కెనడా, జర్మనీ, రష్యా, స్పెయిన్, బెల్జియం, సౌదీ అరేబియా, డెన్మార్క్, బ్రెజిల్, ఇజ్రాయిల్ మరెన్నో దేశాలు చట్ట సవరణ ద్వారా ఖైదీలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అమెరికాలోని 1950 నుండి మిసిసిపి, ఆ తర్వాతి కాలం నుండి కాలిఫోర్నియా, కనెక్టికట్, న్యూయార్క్ , వాషింగ్టన్ రాష్ట్రాలు ఈ వసతిని అమలు చేస్తున్నాయి. బ్రెజిల్, ఇజ్రాయిల్ దేశాలు జైళ్లలో ఉండే స్వలింగ సహజీవన జీవులకు కూడా అనుమతిని ఇచ్చాయి. మ్యారేజి రిజిస్టర్ అయిన జంటలకు 2007 నుండి కాలిఫోర్నియా జైళ్లు కొన్ని గంటలు లేదా రోజులు కలిసి ఉండేందుకు అలంకరించిన బెడ్ రూములను, కండోమ్‌లను అందిస్తున్నాయి. బ్రెజిల్ జైళ్లు ఖైదీల కుటుంబ వివరాలు ముందే సేకరించి నెలకొక మారు వారు కలిసి బతికే ఏర్పాట్లు చేస్తున్నాయి. కెనడా ఖైదీలు రెండు నెలలకోసారి 3 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి జైలులోనే విడిగా ఉండొచ్చు. బిల్లు చెల్లిస్తే వారికి భోజన సదుపాయాలు కూడా అందుతాయి. అయితే ఏ దేశంలోనైనా ఖైదీల ప్రవర్తన, గుణగణాల ఆధారంగా మాత్రమే వారి ఎంపిక జరుగుతుంది. విశేష కానుకలా వచ్చే ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఖైదీలు కూడా బుద్ధిగా మెదులుతారు.
చాలా దేశాల్లో ఈ విషయం ఇంకా ఖైదీల డిమాండుగానే మిగిలి ఉంది. జాతీయ మానవ హక్కుల కమిటీ కోరిక మేరకు మెక్సికో ఈ మధ్య ఇందుకు ఒప్పుకోగా బ్రిటన్‌లో ఇంకా అమలుకు దూరంగానే ఉంది. మన దేశంలో ఖైదీలు కూడా రకరకాల కారణాలతో దంపతులను ఏకం చేయమని కోరుతూనే ఉన్నారు. ఈ విషయంలో రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న డా.సంపూర్ణానంద్ ఓపెన్ జైలు కొంత మినహాయింపుగా భావించవచ్చు. ఈ బహిరంగ జైలుకు ప్రహరీ గోడ, తలుపు తాళం లేవు. దీనిలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇంటి నుంచి పనికి వెళ్లినట్లుగానే ఊర్లోకి వెళ్లి దొరికిన పని చేసుకొని తిరిగి సమయానికి జైలుకు వాపసు వస్తారు. దంపతులు కలిసి బతుకుదామనుకుంటే విడిగా అన్ని సౌకర్యాలు గల గదిని ఇస్తారు. పిల్లలతో కలిసి బతుకొచ్చు. శిక్ష కాలమంతా అలా గడపొచ్చు. అయితే అందరికి ఈ సౌఖ్యం, సౌకర్యం సులభంగా దొరకడం మాత్రం చట్ట సవరణ ద్వారానే సాధ్యం.

బి.నర్సన్
9440128169

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News