పశ్చిమ బెంగాల్‌లో 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కోల్ కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ భారత సుప్రీం కోర్టు 2025 ఏప్రిల్‌లో ఇచ్చిన రూలింగ్ రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా తీవ్రమైన గందరగోళానికి దారితీసింది. 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఈ నియామకాలు జరిపింది. ఈ ప్రక్రియలో తీవ్రంగా అవకతవకలు జరగడంతో ఈ తీర్పు వచ్చింది. నియామకాల ప్రక్రి య పూర్తిగా మోసపూరితంగా ఉందని కోర్టు నిర్ధారణకు వచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై అశనిపాతం సుప్రీం కోర్టు తీర్పు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందనితేల్చిచెప్పినట్లయింది. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ, టిఎంసిలో ఉన్నత స్థాయి నాయకుల ప్రమేయంతో ఈ కుంభకోణం జరగడం రాజకీయంగా తీవ్రనష్టం చేకూర్చింది.
ముఖ్యంగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, సిపిఎం వంటి పార్టీలు ఈ తీర్పును తమకు అనుకూలంగా ఉపయోగించుకుని, టిఎంసి పూర్తిగా అవినీతిమయం అని ఆరోపిస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఎన్నికలకు ముందే మమత పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రం దొరికినట్లయింది. అమిత్ మాల్వియ, సంబిత్ పాత్ర వంటి నాయకులు దీనిని నగదు కొట్టు -జాబ్ పట్టు అన్న కుంభకోణంగా చిత్రీకరించడమే కాక, టిఎంసి అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా చూపుతున్నారు. బెంగాల్‌లో విద్యాబోధన గొప్ప గౌరవంగా భావిస్తారు. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో ప్రతిపక్షాల ప్రచారం ప్రభుత్వానికి దెబ్బే. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సిపిఎం ప్రభావం క్షీణించింది, అయినా ఆ పార్టీ టిఎంసి విద్యా వ్యవస్థను నిర్వహిస్తున్న తీరును తూర్పారబడుతోంది. పారదర్శకత లోపించిందని ఆరోపిస్తోంది. బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాలలో టిఎంసి బలమైనదే. అయినా ప్రతిపక్షాల విస్తృత ప్రచారం వల్ల ప్రభుత్వపాలనపై వ్యతిరేకత పెరగవచ్చు.
మమతా బెనర్జీ స్పందన
సిఎం మమతా బెనర్జీ తీర్పును బహిరంగంగా తిరస్కరించినా, దానిని అమలు చేస్తామని హామీ ఇవ్వడం తీర్పును రాజకీయంగా ప్రేరేపించబడినదిగా చిత్రీకరించడం ఆమె వ్యూహాన్ని సూచిస్తోంది. బిజెపి, సిపిఎంలను ఆమె దుమ్మెత్తిపోస్తూ బెంగాల్‌లో విద్యా వ్యవస్థను అణగదొక్కడానికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, ఆ పార్టీల నిందలను తిప్పికొట్ట లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే, ఆమె వ్యాఖ్యలు- న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను ప్రశ్నించడం వల్ల న్యాయ వ్యవస్థలో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం -మున్ముందు ఆమె పాలనపై మరింత సూృ్కటినీ జరిగే అవకాశం ఉంది. టిఎంసి సర్కార్‌కు సవాళ్లే మూడు నెలలలోపు కొత్త నియామక ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఇచ్చిన ఆదేశం రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాల్‌గా నిలుస్తోంది. కొత్త ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడం, మరింత పకడ్బందీగా నిర్వహించడంతోపాటు ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడం చాలా కీలకం. మళ్లీ ఏదైనా తప్పు జరిగితే సంక్షోభం మరింత జటిలమవుతుంది.
ఈ తీర్పు ఒక్క రోజులో వేలాది మందిని నిరుద్యోగులుగా మార్చేసింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించవలసిందిగా టిఎంసిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి పెరగవచ్చు. అలాగే ఇది తిరిగి ప్రజాదరణ పొందేందుకు పలు ప్రజాకర్షణ చర్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఒక్కసారిగా 25 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగింపు బాధిత టీచర్లు, బోధనేతర సిబ్బందికి తీవ్ర మనస్తాపాన్ని మిగిల్చింది. వీరిలో న్యాయబద్ధంగా నియమింపబడినవారు ఎందరో. ప్రతాప్ రాయ్ చౌదరి, తంపి ఆలం వంటి వారు తమ వ్యాసాలలో ఉపాధి కోల్పోయిన వారి ఆర్థిక, భావోద్వేగాలు, ఎదుర్కొనే నష్టాలు, ఇఎంఐలు, కుటుంబాలపై ఆధారపడిన వారి అనిశ్చిత భవిష్యత్‌ను వివరించారు. సామూహిక తొలగింపు ప్రజల్లో నిరాశా నిస్పృహలు కలిగించే ప్రమాదం ఉంది. వీరిలో సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టని పక్షంలో నిరసనలకు, సామాజిక అశాంతికి దారితీసే అవకాశం ఉంది.
మహిళలలో అశాంతి చిచ్చు
పశ్చిమ బెంగాల్‌లో మహిళలు విద్యాబోధన పట్ల మక్కువ చూపుతారు. ఈ వృత్తికే వారి ప్రథమ ప్రాధాన్యం. మహిళా సాధికారతకు, ముఖ్యంగా సామాజికంగా గౌరవం కలిగించే వృత్తిగా భావిస్తారు. ఈ తీర్పు మహిళా టీచర్లలో తీవ్రమైన అశాంతిని రగిల్చింది. ఉద్యోగం కోల్పోవడంతో పాటు, సామాజికంగా కళంకాన్ని తెచ్చిపెట్టింది. చాలా మంది వివాహ అవకాశాలను దెబ్బతీసింది. సామాజికంగా ఉపాధ్యయ వృత్తిలో ఉన్నవారిని వధువులుగా ఇష్టపడతారు. అలాగే ఒంటరి తల్లులు, ఒంటరిగా తమ కాళ్లమీద తాము నిలబడి జీవనోపాధిని పొందుతున్నవారు ఇక్కట్ల పాలయ్యారు. ఈ తీర్పు లింగ ఆధారిత అసమానతలను పెంచుతోంది. ఈ కుంభకోణం తర్వాత కోర్టు తీర్పుతో ప్రభుత్వ నియామక ప్రక్రియలపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగాయి. విద్యా వ్యవస్థకు వన్నెతెచ్చిన రజత్ హల్దార్ వంటి సీనియర్ ఉపాధ్యాయులు వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ, దోషులతో పాటు, నిజాయితీపరులైన అభ్యర్థులను కూడా ఎందుకు శిక్షకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. ఈ తీర్పు వల్ల న్యాయ వ్యవస్థపై కూడా అపనమ్మకం పెరగవచ్చు.
ఏక మొత్తంగా 25 వేల మంది ఉద్యోగాల రద్దు చాలా అన్యాయంగా భావిస్తున్న వారు ఎందరో. అక్రమాలకు పాల్పడిన వారు, నిజాయితీగా తగిన అర్హతలు కలిగి న్యాయంగా ఉద్యోగం పొందిన వారి మధ్య తేడాను గుర్తించడంలో విఫలమయ్యారని వారు భావిస్తున్నారు.కుంటుపడనున్న విద్యా బోధన గ్రామీణ పాఠశాలల్లో ఏళ్ల తరబడి టీచర్ల కొరత వల్ల విద్యా బోధన అంతంత మాత్రంగా సాగుతోంది. వేలాది మంది ఉపాధ్యాయులను వెంటనే తొలగించడం వల్ల, విద్యా బోధనకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. పేదరికం అధికంగా ఉన్న చాలా జిల్లాల్లో పాఠశాల స్థాయిలోనే చదువు మానివేసేవారు అధికం. 2023లో ఓ నివేదిక ప్రకారం హయ్యర్ సెకండరీ స్థాయిలో విద్యార్థులు ఊహించిన దాని కంటే 56 వేల మంది తక్కువగా ఉన్నారని తేలింది. తీర్పుతో ఉపాధి కోల్పోయిన టీచర్ల స్థానంలో కొత్తవారిని వెంటనే భర్తీ చేయకపోతే ఇంకా సమస్య తీవ్రమవుతుంది. విద్యా సంవత్సరం మధ్యలో తీర్పు వెలువడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెను సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇది ప్రజలలో అసంతృప్తిని రేకెత్తించింది.
తీర్పుపై భిన్నాభిప్రాయాలుతీర్పుపై సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీర్పు సమాజంలో చీలిక తెచ్చిందని చెప్పవచ్చు. కొందరు ఈ తీర్పును అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన మహత్తరమైనదిగా భావిస్తూ, చాలా మంది కష్టపడి పనిచేసే విద్యావేత్తలకు జరిగిన అన్యాయంగా చూస్తున్నారు. కోల్‌కతాలోని షాహిద్ మినార్ సమావేశాలు ఉపాధి కోల్పోయిన టీచర్లలో పెరిగిన నిరాశ నిస్పృహలకు అద్దంపట్టాయి. తీర్పు వల్ల నష్టపోయిన వారికి మద్దతుగా నిలుస్తామని మమతా బెనర్జీ భీషణ ప్రతిజ్ఞ చేయడం అమె మద్దతుదారులను ఉత్తేజపరుస్తోంది. కానీ, జవాబుదారీతనం కోరుకుంటున్నవారిని దూరం చేస్తోంది. సామాజిక విభజనను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ కేసు పశ్చిమ బెంగాల్ పాలనలో వ్యవస్థాగత లోపాలను ఎత్తుచూపింది. రాష్ట్రంలో ఉద్యోగాల కొరత, ప్రభుత్వ ఉపాధిపై మోజు, డిమాండ్ నియామక కుంభకోణాల ప్రమాదాన్ని పెంచుతోంది.
కోర్టు నిర్ణయం న్యాయానికి పెద్ద పీట వేసే లక్ష్యంతో చేసినప్పటికీ, అక్రమార్కులను లక్ష్యంగా చేసుకోవడం, మూకుమ్మడిగా నియామకాలను రద్దు చేయడం న్యాయ వ్యవస్థ విస్తృత దృక్పథంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. కార్యనిర్వాహక వ్యవస్థ ఓవర్ యాక్షన్‌కు చెక్ పెట్టడంలో న్యాయవ్యవస్థ పాత్ర చాలా కీలకమైనది. కానీ సామాజికంగా ఎదురయ్యే పరిణామాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న టిఎంసి రాజకీయంగా టిఎంసి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒక పక్క తమ ఓటు బ్యాంక్‌ను కాపాడుకుంటూ కోర్టు తీర్పును అమలుచేయడం అశిధారా వ్రతమే. న్యాయ వ్యవస్థ విషయంలో మమత ప్రదర్శించిన ఘర్షణాత్మక వాక్చాతుర్యం ఆమె మద్దతుదారులకు ఉత్తేజం కలిగించవచ్చు. కానీ, పాలనాపరమైన వైఫల్యాలు కొనసాగుతే పార్టీకి కీలకంగా ఉన్న మితవాదులను దూరం చేసే ప్రమాదం ఉంది. ప్రతిపక్షం
దూకుడు వైఖరి వ్యూహాత్మకంగా మంచిదే అయినా, మమతా బెనర్జీ వంటి నేతపై సాధించాలం, నమ్మకమైన ప్రత్యామ్నాయాలనూ అనుసరించాలి. పారిశ్రామికాభివృద్ధి అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రంలో విద్యాబోధన స్థిరమైన వృత్తిగా ప్రజలు భావిస్తారు. ఆ అంశాన్ని తీర్పు తేటతెల్లం చేసింది. ఈ తీర్పు అణగారిన వర్గాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. మున్ముందు చేపట్టి నియామక ప్రక్రియ మరింత పారదర్శికంగా నిర్వహించడం, తీర్పువల్ల నష్టపోయిన వారికి మద్దతు ఇవ్వడం వల్ల ప్రభుత్వ సామర్థ్యం పై దుష్ప్రభావాలను తగ్గించవచ్చు. ————-సుప్రీం కోర్టు తీర్పు రాజకీయంగా పెను తుపానునే సృష్టించింది. టిఎంసిపై ప్రజలకు గల విశ్వసనీయతను బలహీనపరచింది.
ప్రతిపక్షాల ధైర్యాన్ని మరింత పెంచింది. సామాజికంగా వేలాది కుటుంబాల జీవితాలను తారుమారు చేసింది. విద్యా వ్యవస్థను దెబ్బ తీయడంతోపాటు విశ్వసనీయతనూ దెబ్బ తీసింది. తీర్పు పుణ్యమా అని మహిళలు, గ్రామీణ సమాజాలు అధిక భారాన్ని మోస్తున్నాయి. ఈ తీర్పు అవినీతిని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్నా దాని అమలులో న్యాయమైన, సాధ్యాసాధ్యాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. టిఎంసి ప్రజామద్దతును సమతుల్యం చేయడం ద్వారా రాజకీయంగా బలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజానీకానికి జరిగిన నష్టాన్ని తగ్గించడం, తగిన పరిష్కారాన్ని కనుగొనడం తక్షణ అవసరం.
– గీతార్థ పాఠక్ ఈశాన్యోపనిషత్( రచయిత ఈనాన్య రాష్ట్రాల సామాజిక రాజకీయాల అంశాల విశ్లేషకుడు)