మన తెలంగాణ/హైదరాబాద్: హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీర్పు ఇచ్చిందని బిఆర్‌ఎస్ గద్వాల నియోజక వర్గం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఇది ఎక్స్ పార్టీ తీర్పని ఆయన ఆయన ఆరోపించారు. తనను ఎమ్మెల్యేపదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపద్యంలో బుధవారం బిఆర్‌ఎస్ ఎల్‌పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చానన్నది అసత్యమని ఆయన పేర్కొన్నారు. నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి తీర్పు పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన వెల్లడించారు. తనపై నాలుగు అభియోగాలతో ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించారని వివరించారు.
హైకోర్టు తీర్పు పై నాకు ఇంకా పూర్తి సమాచారం అందలేదని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.కొందరికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తనను 37వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 50వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.ప్రత్యర్ధులు దొడ్డిదారిన కోర్టుకు వెళ్లి సాధించడం సిగ్గుచేటని అన్నారు. కోర్టులంటే నమ్మకం ఉందన్న ఆయన పూర్తి సమాచారం వచ్చాక సుప్రీం కోర్టులో తేల్చుకుంటానని అన్నారు. కాగా గతంలో వనమా వెంకటేశ్వరరావు విషయంలో హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపద్యంలో కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ ఎలాంటి నిర్ణయం రాబోతుందన్నది ఆసక్తిగా మారింది.