న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
డబ్లుఎఫ్‌ఐ మాజీ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. నిందితుల తరఫున న్యాయవాది రాజీవ్ మోహన్ కోర్టులో వాదనలు వినిపిస్తూ నిందితుల అరెస్టుకు ముందే చార్జిషీట్ దాఖలైనందున తాను బెయిల్ బాండ్లు సమర్పిస్తున్నానని తెలిపారు.
కాగా..ఢిల్లీ పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ నిందితుడిని ఢిల్లీ పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు. సాక్షులను ప్రభావితం చేయబోమని నిందితులకు షరతు విధించిన పక్షంలో వారికి బెయిల్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై గురువారం వాదనలు వింటామని జెసిఎంఎం జస్పాల్ తెలిపారు.