Monday, December 23, 2024

రాహుల్ గాంధీకి శాశ్వత మినహాయింపునిచ్చిన కోర్టు

- Advertisement -
- Advertisement -

థానే: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త రాహుల్ గాంధీపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావడాన్ని శాశ్వతంగా మినహాయిస్తూ మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు శనివారం ఉత్తర్వునిచ్చింది. రాహుల్ గాంధీ తన న్యాయవాది నారాయణ అయ్యర్ ద్వారా దాఖలుచేసిన దరఖాస్తును పరిశీలించిన భీవండి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సి. వాడికర్ ఈ మినహాయింపునిచ్చారు. స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేశ్ కుంతే దాఖలు చేసిన పరువునష్టం కేసులో సాక్ష్యాలను జూన్ 3న రికార్డుచేస్తామని మెజిస్ట్రేట్ తేదీని ఖరారు చేశారు.

రాజేశ్ కుంతే 2014లో భీవండి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదును దాఖలు చేశారు. మహాత్మాగాంధీ హత్య కేసులో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందించినందుకు అతడు ఈ పరువునష్టం దావా వేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల ఆర్‌ఎస్‌ఎస్ పరువు దెబ్బతిన్నదని కుంతే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ 2018 జూన్‌లో కోర్టు ముందు హాజరయి తాను నిర్దోషినని విన్నవించుకున్నారు.

‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిందితుడు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు కావడాన్ని శాశ్వతంగా మినహాయిస్తూ ఉత్తర్వు జారీచేయడమైనది, అయితే కోర్టు కోరినప్పుడు నిందితుడు హాజరుకావలసి ఉంటుంది’ అని ఉత్తర్వులో మెజిస్ట్రేట్ పేర్కొన్నారు.

ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఓ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. తర్వాత అత్యంత వేగంగా ఆయన పార్లమెంటు సభ్యత్వంపై వేటు కూడా పడింది. ఇదిలావుండగా రాహుల్ గాంధీ ఇప్పుడు ఎంపీ కానందున ఆయనకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వరాదని అర్జీదారుడైన రాజేశ్ కుంతే కోర్టు ముందు వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News