కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని నేషనల్ మెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పదేపదే ప్రశ్నించడాన్ని నిరసిస్తూ రెండేళ్ల క్రితం జగిరిన నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి సంబంధించిన కేసులో ఆగస్టు 29న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు బెంగళూరు కోర్టు గురువారం సమన్లు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఇడి అనవరంగా వేధించడాన్ని వ్యతిరేకిస్తూ 2022 జూన్‌లో కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక నిరసన ప్రదర్శన నిర్వహించింది.
నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ సిద్దరామయ్య, శివకుమార్‌తోసహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి విల్సన్ గార్డెన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నిరసన శాంతి భద్రతలకు విఘాతం కల్పించిందని, అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా దీన్ని నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శివాజీనగర్ పోలీసు స్టేషన్‌లో కూడా నమోదైన ఇదే రకమైన కేసును కర్నాటక హైకోర్టు తరువాత కొట్టివేసింది.