Saturday, November 9, 2024

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

Court orders registration of case against R S ​​Praveen Kumar

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరోస్ అధినేత, మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కరీంనగర్ మూడవ పట్టణ పోలీసులకు ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సాయిసుధ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసినారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేశారని న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వివరించారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చ్ 2021 లో పెద్దపల్లి జిల్లా జులపెల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈక్రమంలో స్వేరో సభ్యులతో కలిసి స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు చేయించిన ప్రతిజ్ఞలో హిందు దేవుళ్లు అయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల ఎవరి మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే శ్రాద్ధా కర్మలు పాటించనని, పిండదానాలు చేయబోమని, హిందు విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి స్వేరోస్ సభ్యులతో పాటు ప్రవీణ్ కుమార్ కూడా ఎడమ చేతి చాచి ప్రతిజ్ఞ చేశారు.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని చూసిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తన మత విశ్వాసాలను దెబ్బతీసినారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి హిందు దేవుళ్లను ఆవమానించి, కించపరిచే విధంగా వ్యవహరించినారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కుమార్ ప్రతిజ్ఞ చేసిన వీడియోను, పలు పత్రికలో వచ్చిన వార్తలను సేకరించి, ఆధారాలతో సహా కరీంనగర్ మూడవ పట్టణ పోలీసు స్టేషన్ లో తేదీ 16 మార్చ్ 2021 రోజున ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు ప్రవీణ్‌కుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పై అధికారైన పోలీసు కమీషనర్ కు తేదీ 18 మార్చ్ 2021 రోజున మరోసారి ఫిర్యాదు చేశాడు. సదరు పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రవీణ్‌కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో చివరికి తేదీ 22 మార్చ్ 2021 రోజున ప్రిన్సిపాల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోర్టులు సరిగా పని చేయకపోవడంతో ఇన్ని రోజులు పిటిషన్ పెండింగులో వస్తూ ఉన్నది.

చివరికి కేసు ఆధారాలను, పూర్వపరాలను పరిశీలించిన తరువాత ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా న్యాయమూర్తి సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐ.పి.ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న స్వేరోస్ అధినేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వసాలను దెబ్బతీసినాడని మహేందర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. హిందువులకు, హిందు దేవుళ్లకు, దేశానికి వ్యతిరేకంగా సెక్యూలర్ ముసుగులో మాట్లాడడం ఒక ఫ్యాషన్ గా మార్చుకున్నారని, వీళ్ళు ఎంతటివారైన విడిచిపెట్టేదిలేదని బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

అలాగే స్వేరోస్ సంస్థ గురుకులాల విద్యార్థులకు ప్రతిజ్ఞలు చేయిస్తూ హిందు వ్యతిరేక భావజాలాన్ని పెంచుతూ హిందు దేవి దేవతల పట్ల విషం కక్కుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విద్యార్థుల మెదడులో గురుకులాల కార్యదర్శి ముసుగులో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విషబీజాలను నాటుతున్నారని బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ను, న్యాతరి శంకర్ బాబు లపై వెంటనే కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదిదారైన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News