నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న మూవీ ‘కోర్ట్ – -స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ప్రియదర్శి మీడియాతో మాట్లాడుతూ “ఈ కథ రాసేటప్పుడు ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు రామ్‌జగదీష్. కానీ నేను ఈ క్యారెక్టర్ చేస్తానని బ్రతిమిలాడాను.
సరే అని ఒప్పుకొని నాని దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు అన్న కూడా అదే అన్నాడు. ఇక –ప్రతి కోర్టు రూమ్ డ్రామాలో ముఖ్యంగా మనకి సాక్షాధారాలు, నిజాలు, అలానే వాటికి అమలు అయ్యే చట్టాలు… ఇవన్నీ కూడా మనకి కొంతమేరకు తెలియాలి. అలానే కొంత మంది లాయర్లు దగ్గరికి వెళ్లి పోక్సో కేసు అంటే ఏమిటి, దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, అలానే కొంతమంది జడ్జీల దగ్గరనుంచి కొన్ని జడ్జిమెంట్ స్వీకరించి వాటి నుంచి ఒక మెటీరియల్ తయారు చేశాడు రామ్ జగదీష్. అవి నాకు కూడా ఇచ్చాడు. –నేను కూడా రియల్‌గా కోర్టులో లాయర్లు, జడ్జీలు ఎలా ఉంటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వారి భాష… ఇలా ప్రతి ఒక్కటి చూసి అలా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం.సెక్షన్లు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాను.
ఒకడు దొంగతనం చేసి పోలీసులకు దొరికితే, పోలీసులు ఆ దొంగ నేరస్తుడు అని నిరూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనం కోర్టు భాషలో చెప్పాలి అంటే స్టేట్ వర్సెస్ అక్యూసెడ్ అని అంటాం. చట్టానికి అందరూ ఒక్కటే అనే సైన్‌తో అలా పెట్టాం. ‘కోర్ట్’ చిత్రం చాలా రియలిస్టిక్‌గా తీశాం. లాయర్ క్యారెక్టర్ చేసిన తరువాత వారి మీద గౌరవం పెరిగింది. నాని ‘ఈ సినిమా చూడండి నచ్చకపోతే నా సినిమా కూడా చూడటం మానేయండి’ అని అన్నారు అంటే ఆయనకు కథ మీద వున్న నమ్మకమే. నాని ఎంచుకునే కథలు కూడా అలానే వుంటాయి. అలాగే ఆయన సినిమా చూశాక ‘నేను ఏదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది’ అని అన్నారు. ఇక ప్రస్తుతం నేను చేస్తున్న సారంగపాణి జాతకం సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ‘ప్రేమంటే’ చేస్తున్నాను, గీతా ఆర్ట్ లో కూడా ఒక ఫిలిం సైన్ చేశాను”అని అన్నారు.