న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బిజెపి ఎంపి, డబ్లుఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు వెలువరించింది. ఆయన ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలని ఇక్కడి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సంబంధిత వ్యాజ్యంలో ఆయనపై విచారణకు అవసరం అయిన సాక్షాధారాలు , సముచిత ప్రాతిపదికత ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ తెలిపారు. ఈ ఉదంతానికి సంబంధించి కుస్తీ సమాఖ్యకు చెందిన సస్పెండయిన సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా సమన్లు వెలువరించారు.
ఇరువురు నిందితులుగా ఉన్నందున వీరికి సంబంధిత సమన్లు అందేలా చూడాలని స్థానిక కన్నాట్ పోలీసు స్టేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు నిందితులు స్థానికంగా ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి వీరికి తక్కువ గడువు సమన్లు ఇచ్చినట్లు న్యాయమూర్తి తెలిపారు. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఇప్పటికే సింగ్‌ను పోలీసులు రెండుసార్లు విచారించారు. తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఈ దశల్లో ఆయన తోసిపుచ్చారు. ఇవన్నీ కట్టుకథలని తెలియచేసుకున్నారు.