Monday, November 18, 2024

నిందితుడి రికార్డును బట్టే బెయిల్

- Advertisement -
- Advertisement -

 

Courts must find out accused's history before granting Bail

కోర్టులకు సుప్రీం జాగ్రత్తలు
ఎటువంటి వారో చూడాలి
కేసుల తీవ్రత గమనించాలి

న్యూఢిల్లీ : ఏదేనీ కేసులోని నిందితుడికి బెయిల్‌ను ఆషామాషిగా ఇవ్వరాదని, నిందితుడి పూర్వాపరాలను సమగ్రంగా ఆరాతీయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయస్థానాలు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని తెలిపింది. తీవ్రస్థాయి నేరాలలో అభియోగాలకు గురై నిందితుడిగా ముద్ర పడ్డ వ్యక్తికి బెయిల్‌తో తాత్కాలికంగా అయినా స్వేచ్ఛ లభిస్తుంది. బెయిల్‌పై విడుదల అయ్యి వచ్చిన తరువాత తిరిగి నేరానికి పాల్పడే అవకాశం ఉందా? ఎటువంటి గత రికార్డు ఉంది? సదరు వ్యక్తిని విశ్వసించవచ్చా? అనేవి కోర్టులు పూర్తిగా నిర్థారించుకుని తీరాలి. తరువాతనే బెయిల్ మంజూరీ నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు ధనంజయ వై చంద్రచూడ్, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం రూలింగ్ వెలువరించింది. హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలతో నిందితుడు అయిన ఓ వ్యక్తికి పంజాబ్ హర్యానా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు బెయిల్ విషయాలలో మరింత జాగరూకతకు హైకోర్టులకు, కిందిస్థాయి న్యాయస్థానాలకు జాగ్రత్తలు తెలిపింది.

వ్యక్తులపై దాఖలైన నేరాభియోగాలు ఏమిటీ? కేసులకు సంబంధించి ఉన్న సాక్షాధారాలు బలంగా ఉన్నాయా? లేదా, అన్నింటికంటే మించి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న నిందితుల పూర్వాపరాలు ఏమిటీ, ఎటువంటి నడవడికతో ఉన్నారు? చట్టాన్ని దుర్వినియోగపర్చుకుంటాడా? వంటి పలు అంశాలను విశ్లేషించుకుని తీరాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. నేరం, పడబోయే శిక్ష ఏ పాటిది? వంటి కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకునే బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అయితే బెయిల్ నిరాకరణ అనేది స్వేచ్ఛకు విఘాతం పరిధిలోకి వస్తుందనే ఇంతకు ముందటి తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. బెయిల్‌ను నిరాకరించడం శిక్షలో భాగం అనే రీతిలో చూడరాదని, న్యాయవ్యవస్థ పటిష్టత కోణంలోనే దీనిని చూడాల్సి ఉంటుందని ధర్మాసనం తాజాగా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News