బ్రిటీషర్ల పాలన తర్వాత దయనీయ స్థితిలో మౌలిక వసతులు
పరిష్కారానికి ఎన్‌జెఐసి ఏర్పాటు చేయాలి
ఇందిరపై అనర్హత వేటు ధైర్యంతో కూడుకున్న తీర్పు: సిజెఐ
అలహాబాద్ : దేశంలోని న్యాయస్థానాల కార్యాలయాల శిథిలావస్థ బాధాకరం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారి పాలన తరువాత కోర్టులను గాలికొదిలినట్లుగా వ్యవహరించడం మరీ దారుణం అన్నారు. ఇన్నేళ్లు అయినా దేశంలోని న్యాయస్థానాల నిర్వాహక కేంద్రాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. అవి దెబ్బతిని ఉన్నా వాటిలోనే నిర్వహక కార్యక్రమాలు సాగించాల్సి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో నేషనల్ లా యూనివర్శిటీకి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసి శంకుస్థాపన, ఇతర కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోర్టు భవనాల నిర్మాణ మౌలిక దుస్థితిని ప్రస్తావించారు.
బ్రిటిష్ పాలన తరువాత న్యాయవ్యవస్థ నిర్వహణ సంబంధిత విషయంలో ఈ విధంగా తీవ్రస్థాయిలో నిర్లక్షం వహించడం కొట్టొచ్చే పరిణామం అయిందన్నారు. దేశంలోని పలు న్యాయస్థానాలు ఇప్పటికీ దెబ్బతిన్న భవనాలు, పురాతన కట్టడాలు, పెచ్చులూడే స్థితిలో ఉండే నివాసాలలోనే సాగుతున్నాయనే విషయాన్ని అత్యున్నత న్యాయస్థాన కీలక ప్రతినిధి ఈ సందర్భంగా ప్రధమ పౌరుడి సమక్షంలో తెలిపారు. అలహాబాద్‌లో నూతనహైకోర్టు భవన నిర్మాణానికి కూడా ప్రముఖులిద్దరు పునాది రాయి వేశారు. న్యాయస్థానాలకు మౌలిక నిర్మాణ వ్యవస్థ సరైన విధంగా ఉండేందుకు వీలుగా వెంటనే నేషనల్ జుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ( ఎన్‌జెఐసి) ఏర్పాటు చేయాలని సూచించారు. దెబ్బతిని ఉన్న కోర్టులలో విచారణలు జరగడం, ఎటువంటి సౌకర్యాలు లేని స్థితిలో ఉన్న వాటిలో లాయర్లు, కక్షిదారులు ఉండాల్సి రావడం చేదు అనుభవాలనే అందిస్తుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కోర్టులలో ఇబ్బందికరమైన వాతావరణంలో పనిచేయాల్సి రావడం వల్ల కోర్టు సిబ్బందికి, న్యాయమూర్తులకు తమ విధుల సమర్థవంత నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కోర్టులకు సరైన మౌలిక వసతుల కల్పనను పట్టించుకోవడం మానేశామని అన్నారు. తమ ప్రసంగాన్ని తొలుత కొద్దిసేపు హిందీలో ఆరంభించిన సిజెఐ కోర్టులకు సమగ్రమైన వసతి ఏర్పాట్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించడం కీలకమైన అంశం అన్నారు. ఈ ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు సరైన ప్రతిపాదనలను వెలువరించేందుకు తాను ఎన్‌జెఐసి ఏర్పాటుకు సిఫార్సు చేస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇతరత్రా రంగాలలో జాతీయ స్థాయిలో ఆస్తుల సంపదల సృష్టికి దారితీసేలా వ్యవహరించే వేర్వేరు మౌలిక సాధనాసంపత్తుల అభివృద్ధి సంస్థల తరహాలోనే ఈ ఎన్‌జెఐసి కూడా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఈ అధీకృత సంస్థ రూపొందించే ఏదైనా ఒక నమూనా భవనం తరహాలోనే పలు చోట్ల న్యాయస్థానాలు రూపొందిస్తే బాగుంటుందని సూచించారు. దీని వల్ల న్యాయవ్యవస్థల నిర్వహణకు సమగ్ర రూపం ఏర్పడుతుందన్నారు. న్యాయస్థానాలకు సరైన ఏర్పాట్లు ఉంటే అవసరం అయిన వారికి సరైన రీతిలో సమగ్ర న్యాయం అందేందుకు మరింతగా వీలేర్పడుతుంది. మారుతున్న సమాజంలో పెరుగుతున్న కేసులు, కేసులు వేసే వారి సంఖ్య పెరగడం వంటి పరిణామాల నడుమ కోర్టులు సక్రమ రీతిలో ఉండటం మంచిదన్నారు.
పేదల వద్దకు న్యాయం.. రాష్ట్రపతికి సిజెఐ ప్రశంస
గౌరవనీయ రాష్ట్రపతి కోవింద్ తీసుకుంటున్న చర్యలతో పేదలకు న్యాయం అందుబాటులోకి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి కొనియాడారు. రాష్ట్రపతి తరచూ పేద కక్షిదారుల తరఫున గళమెత్తుతున్నారు. న్యాయవ్యవస్థ వారికి అందుబాటులోకి రావడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పులను పలు ప్రాంతీయ భాషలలోకి తర్జుమా చేసే ఆలోచన రాష్ట్రపతిదే అని గుర్తు చేశారు. ఇటువంటి ఏర్పాటుతో సామాన్యుడికి కూడా న్యాయవ్యవస్థ పట్ల, తీర్పులలోని అంశాల పట్ల సరైన అవగావహన ఏర్పడుతుందని , దీనిని ఇప్పుడు ఆచరణలో పెట్టామని తెలిపారు.