అమెరికాలో అనుమతికి దరఖాస్తు
హైదరాబాద్ /వాషింగ్టన్ : భారత్ బయోటెక్ తయారీ టీకా కొవాగ్జిన్‌ను పిల్లలకు కూడా వాడేందుకు అనుమతించాలని అభ్యర్థన వెలువడింది. అమెరికా, కెనడాలలో ఈ మేరకు అత్యవసర వాడకపు అనుమతికి ఆక్యూజెన్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ)కు దరఖాస్తు చేసుకుంది. భారత్ బయోటెక్‌సంస్థకు ఆక్యూజెన్ అమెరికా భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ మధ్యనే కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వాడకపు అనుమతి దక్కింది. బాలలకు కొవిడ్ టీకాల అంశం పలు దేశాలలో ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంది. అయితే తమ టీకాల పనితీరుపై ఈ మధ్యనే భారత్ బయోటెక్ భారతదేశంలో రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు వారిపై వాడకపు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ క్రమంలో జరిపిన ఫేజ్ 2/3 పరీక్షలలో ఈ టీకా బాలల్లో కూడా వైరస్‌ను తట్టుకుని నిలిచే సమర్థతను చాటిందని, దీనిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాక్సిన్‌ను బాలల్లో వాడేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ దిశలోని శూన్యత దిశలో ఇదో ఆశాకిరణం అవుతుందని ఆక్యుజెన్ ముఖ్య కార్వనిర్వాహక అధికారి , సహ వ్యవస్థాపకులు శంకర్ ముసునూరి తమ లేఖలో తెలిపారు.