హైదరాబాద్ నుంచి విమానంలో..
ఒక్క డోసుకు రూ.295
హైదరాబాద్: భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకాలను మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి దేశంలోని 11 ప్రాంతాలకు తీసుకువెళ్లనున్నట్టు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో అధికారులు తెలిపారు. కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ(డిసిజిఐ) ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి విడతగా భారత్ బయోటెక్ నుంచి కొవాగ్జిన్ 55 లక్షల డోసులను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. వీటిలో 38.50 లక్షల డోసులకు రూ.295 చొప్పున ప్రభుత్వం చెల్లించాలి. మిగతా 16.50 లక్షల డోసులను భారత్ బయోటెక్ ఉచితంగానే ఇస్తున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో, కొవాగ్జిన్ సగటు ధర డోసుకు రూ.206 కానున్నది. కొవాగ్జిన్‌ను ఐసిఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవి)తో కలిసి భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు రూపొందించారు. హైదరాబాద్‌లోని బయోసేఫ్టీ లెవెల్3(బిఎస్‌ఎల్3) ల్యాబ్‌లో కొవాగ్జిన్‌ను తయారు చేస్తున్నారు.