న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా డెల్టా ప్లస్ వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకాను ఐసిఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో తయారు చేసింది. డెల్టా వేరియంట్‌తోపాటు డెల్టా ప్లస్ వేరియంట్‌ను కూడా ఈ వ్యాక్సిన్ సమర్ధంగా ఎదుర్కొంటున్నట్టు అధ్యయనంలో తేలింది. ఈ టీకాకు 77.8 శాతం సమర్ధత ఉన్నట్టు ఇటీవల మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కొత్త డెల్టా వేరియంట్ నుంచి 65.2 శాతం రక్షణ కల్పించిందని భారత్ బయోటెక్ ఇటీవల వెల్లడించింది. తీవ్రమైన కొవిడ్ నుంచి 93.4 శాతం వరకు సమర్ధతను ప్రదర్శించిందని వివరించింది. వ్యాధి సోకినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించని (అసింప్టమేటిక్ కొవిడ్ ) వారికి కూడా 63.8 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని వివరించింది.