డబ్లుహెచ్‌ఒ అనుమతి జారీ
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ ఉత్పత్తి అయిన కొవాగ్జిన్ అత్యవసర వాడకపు అనుమతి (ఇయుఎల్)కి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించింది. ఈ మేరకు బుధవారం డబ్లుహెచ్‌ఒ అధికారిక ట్వీటు వెలువరించింది. చాలారోజులుగా ఈ వ్యాక్సిన్‌కు అధికార అనుమతి దశ పలు పరిశీలనల ప్రక్రియతో జాప్యానికి గురవుతూ వచ్చింది. ఈ దశలోనే ముందుగా టీకాకు అనుమతికి సిఫార్సు చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సాంకేతిక సలహా బృందం (ట్యాగ్) ప్రతిపాదనలు వెలువరించింది. కొవిడ్ వ్యాక్సిన్ల అనుమతి జాబితా ప్రక్రియలోకి కొవాగ్జిన్ చేరాల్సి ఉందని అభిప్రాయపడిందని సంబంధిత అంశంపై అవగావహన ఉన్న వర్గాలు తెలిపాయి.
దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక అనుమతి ఆదేశాలను వెలువరించింది. దీనితో ఈ టీకాను ఇతర దేశాలకు సరఫరా చేసేందుకు వీలేర్పడింది. పైగా ఈ టీకాను పొందిన భారతీయ పౌరులు విదేశాలకు ఎటువంటి కొవిడ్ ఆంక్షలకు గురి కాకుండా వెళ్లవచ్చు. స్వీయ నిర్బంధం ఇతర ఆంక్షలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్‌కు అత్యవసర వాడకపు అనుమతి దిశలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు స్థాయిల్లో పరిశీలన జరిపింది. ఇప్పుడు ట్యాగ్ నుంచి దీనికి సానూకూల సిఫార్సు రావడం కీలక పరిణామం అయింది. అత్యంత సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా పేరు తెచ్చుకున్న కొవాగ్జిన్‌కు అధికారిక వాడకపు అనుమతి కోసం భారత్ బయోటెక్ సంస్థ ఈ ఏడాది ఎప్రిల్ నుంచి దరఖాస్తులు చేసుకుంటూ వచ్చింది.