మూడోదశ క్లినికల్ ట్రయల్స్ డేటా భారత్ బయోటెక్ వెల్లడి
న్యూఢిల్లీ : కొవిడ్ 19ని నియంత్రించడంలో తమ వ్యాక్సిన్ కొవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యాన్ని చూపించిందని వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ శనివారం ప్రకటించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను ఈ మేరకు ఉదహరించింది. తీవ్రంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ నుంచి 65.2 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని వివరించింది. కొవిడ్ 19 లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో 93.4 శాతం ప్రభావం చూపిస్తుందని వివరించింది. భారత్‌లో జరిగిన అతి పెద్ద ట్రయల్స్‌లో కొవాగ్జిన్ టీకా సురక్షితమైందని రుజువైందని సంస్థ పేర్కొంది. శాస్త్రీయ విశ్వాసం, సామర్థ్యం, నిబద్ధత, తదితర లక్షాలతో క్లినికల్ రీసెర్చి, డేటా, భద్రత, సమర్థత తదితర ప్రపంచ స్థాయి పది ప్రమాణాలను సాధించి ఆమోదం పొంది ప్రపంచ పటంలో భారత్‌ను తాము ప్రదర్శించడం గర్వకారణంగా ఉందని భారత్ బయోటెక్ సహ సంస్థాపకులు సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు.
గత ఏడాది నవంబర్ 15 న జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది మొదటి డోసు తీసుకోగా, 2021 జనవరి 7న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. 146 రోజుల పాటు వీరిని పరిశీలించారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చేయగలవని నిరూపించినట్టు అయిందని భారత్ బయోటెక్ ఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. భారత్ బయోటెక్ కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం టీకా డ్రైవ్‌లో భాగంగా అత్యవసర వినియోగం కింద టీకాను వినియోగిస్తున్నారు.