న్యూఢిల్లీ : స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కరోనా కొత్త రకాలపై సమర్ధంగా పనిచేస్తోందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో మొదట గుర్తించినట్టు చెబుతున్న బి.1.617 కరోనా వేరియంట్‌తోపాటు బ్రిటన్‌లోని వేరియంట్ బి.1.1.7 వైరస్‌ను కొవాగ్జిన్ టీకా తటస్థీకరిస్తున్నట్టు తెలియచేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించారు.
వ్యాక్సిన్ వేరియంట్ ( డి 514 జి ) తో పోలిస్తే బి.1.517 రకాన్ని తటస్ఠీకరించడంలో కొవాగ్జిన్ చెప్పుకోదగిన విధంగా తగ్గిస్తున్నప్పటికీ, అంచనా వేసిన దానికంటే ఎక్కువ రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. మెడికల్ జర్నల్ లో ఇది ప్రచురణ అయింది. కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే డేటా పరిశోధన ద్వారా వెల్లడికావడంతో కొవాగ్జిన్‌కు మళ్లీ అంతర్జాతీయ గుర్తింపు లభించిందని బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి సీతారామన్‌కు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు ట్వీట్ ద్వారా సమాచారం టాగ్ చేశారు.