Sunday, January 19, 2025

అభ్యర్థులను వెంటాడుతున్న కోవర్టులు

- Advertisement -
- Advertisement -

అభ్యర్థుల వ్యూహాలు క్షణాల్లో ప్రత్యర్థులకు చేరవేత, కోవర్టులతో కలవరపడుతున్న అభ్యర్థులు

మన తెలంగాణ / నిజామాబాద్ బ్యూరో : ప్రతికూల పరిస్థితులను అధిగమించి టికెట్ సాధించి గెలుపే లక్షంగా బరిలో దిగిన అభ్యర్థులను కోవర్టు భయం వెంటాడుతోంది. అందుకే కుటుంబ సభ్యులనే కోటరీగా పెట్టుకున్నారు. పార్టీ నేతలను, కీలక నేతలను కేవలం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాల ఖరారు చేయడానికే పరిమితం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు… ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ఎత్తుగడలు మాత్రం అత్యంత గోప్యంగా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా పంప కాలు.. మద్దతు ప్రక్రియల మీద అభ్యర్థులు దృష్టిపెట్టారు. దీంతోపాటు ప్రత్యర్థుల ఎత్తుగడలు ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తున్నారు.

తాము ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నామనేది ఎంత ముఖ్య మో ప్రత్యర్థులు అనుసరిస్తున్న వ్యూహాలు ముందే పసి గట్టడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తున్న అభ్యర్థులు కోవర్టు అస్త్రాలను సంధిస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను ఎప్పటికప్పుడు తమకు చేరవేసే వారిని సెట్ చేసుకుంటూనే తను శిబిరంలో అలాంటి కోవర్టు బెడద లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసు కోవడానికి అభ్యర్థులు భారీ మొత్తాల్లోనే వెచ్చిస్తున్నారు. అభ్యర్థుల వెన్నంటే ఉండే వారిని తమకు అనుకూలంగా చేసుకోవడానికి అభ్యర్థులు వ్యయ ప్రయాసలు పడుతున్నారు.

అక్కరకు కోవర్టు వ్యవస్థ…

ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వెళ్లిన నేతలకు ఇలాంటి బెడద ఎక్కువగా ఉంది, ప్రత్యర్థులు ఎటువైపు అడుగులేస్తున్నారు? ఎవరెవరి మద్దతు కూడగడుతున్నారు? ఎవరితో రహస్య భేటీలు జరుపుతున్నారనేది ఆరా తీయడానికే కోవర్టు వ్యవస్థ అక్కరకు వస్తుంది. అభ్యర్థుల కీలక సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకొని అందుకు తగ్గట్టుగానే ఎత్తుగడలు వేస్తున్నారు. ఫలితాల్లో ప్రభావితం చేసే కుల సంఘాల మద్దతు కూడగట్టే సమాచారం ముందే తెలుసుకోవడం అభ్యర్థులకు అనివార్యంగా మారింది. అభ్యర్థులు కులసంఘాల మద్దతు కూడగట్టడానికి అభ్యర్థులు పెద్దమొత్తంలోనే వెచ్చిస్తున్నారు. అందుకే వారు తమ చేజా రకుండా ప్రత్యర్థులకు చిక్కకుండా డేగ కన్ను వేసి పెడుతున్నారు. అలాగే ప్రత్యర్థి శిబిరంలో అసంతృప్తిగా ఉన్న వారి కోసం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇలాంటి కోవర్టు వ్యవస్థ పటిష్టంగా ఉంది. అర్బన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌లలోనే త్రిముఖ పోటీ ఉంది. మిగితా సెగ్మెంట్‌లలో బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌ల మధ్యే హోరాహోరీ పోరు ఉంది. గత ఎన్నికల్లో తమకు కోవర్టులుగా పని చేసిన నేతలనే ఈసారి కూడా ఎంగేజ్ చేసుకున్నారు. అందుకే ప్రత్యర్థుల కీలక సమాచారం అభ్యర్థులకు క్షణాల్లో వచ్చేస్తుంది. ఇటీవల నిజామాబాద్ అర్బన్‌లోని పద్మశాలి సంఘం నేత జాతీయ పార్టీ అభ్యర్థితో డీల్ సెట్ చేసుకున్నాడు. నగదు చేతికి అందేలోపే ఆ సమాచారం లీక్ అయింది. ఆ కుల పెద్దల్లో రచ్చ జరిగింది. నిజానికి ఈ సమాచారం బయటికి ఎలా పొక్కిందనేది సదరు అభ్యర్థికి అంతు చిక్కలేదు. దీనితో ఓ రెండు రోజులు కీలక యువనేతను దూరం పెట్టేశారు. నిజానికి గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్న అభ్యర్థులకు కీలక వ్యవహరాలు బయటికి పొక్కడంతో రగిలిపోతున్నారు. ఇలా అభ్యర్థుల చేస్తున్న కార్యక్రమాలను ముందే ప్రత్యర్థులకు తెలుస్తుండటంతో ఎవరు కోవర్టో, ఎవరూ నమ్మిన వారే అర్థంకాక మదనపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News