జొహెన్నెస్‌బర్గ్: ఒమిక్రాన్ వెలుగు చూసిన తరువాత దక్షిణాఫ్రికాలో వైరస్ సంక్రమణ అనూహ్యరీతిలో పెరుగుతోంది. గడిచిన వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రెండు వారాల క్రితం కొవిడ్ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, ప్రస్తుతం అది 25 శాతానికి చేరుకుంది. ఇలా దేశంలో కొవిడ్ నాలుగో వేవ్ ఎదుర్కొంటున్న దశలో ఇన్‌ఫెక్షన్ రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యరంగ నిపుణులు ఇప్పటికే అంచనా వేశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా పేర్కొన్నారు. దేశంలో వైరస్ తీవ్రత పెరిగిన సందర్భంగా దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కొవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసే అంశంపై కొవిడ్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్ త్వరలోనే సమావేశమవుతుందని వివరించారు.
ఒమిక్రాన్ తీవ్రత, సంక్రమణ గురించి దక్షిణాఫ్రికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ముమ్మరంగా కృషి చేస్తున్రాని వెల్లడించారు. ఈ వేరియంట్‌ను వ్యాక్సిన్లు ఎంతవరకు ఎదుర్కొంటాయనే కోణం లోనూ పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేవలం వ్యాక్సిన్ మాత్రమే కొత్త ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయగలవని శాస్త్రీయ ఆధారాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. మరికొన్ని రోజుల్లోనే ఈ వేరియంట్‌కు సంబంధించి అదనపు సమాచారం తెలుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు.
Covid 19 4th wave start in South Africa