అల్జిమీర్స్ కన్సార్టియం అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్: దీర్ఘకాలిక శ్వాస,నాడీ సంబంధిత, ఉదరకోశ వ్యాధులతో బాధపడేవారికి కొవిడ్19 సోకిన తర్వాత మతిమరుపు(అల్జిమీర్స్)లాంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్వల్ప లేదా దీర్ఘకాలిక నాడీ సంబంధిత, మానసిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు వాసన, రుచి కోల్పోతున్నారని వారిలో ‘బ్రెయిన్ ఫాగ్’ ఏర్పడుతున్నదని పరిశోధకులు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్, అల్జీమీర్స్ అసోసియేషన్‌కు చెందిన అంతర్జాతీయ కన్సార్టియం గ్రీస్, అర్జెంటీనాలోని వృద్ధులపై ఈ పరిశోధన జరిపింది. వీరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌ఒ) సాంకేతిక సహకారం అందించింది. వీరు తమ పరిశోధనా ఫలితాలను అమెరికాలోని డెన్వర్‌లో జులై 26 నుంచి 30 వరకు నిర్వహించిన అంతర్జాతీయ అల్జిమీర్స్ అసోసియేషన్ సదస్సులో వెల్లడించారు. అర్జెంటీనాలోని 300 మంది వృద్ధుల్ని ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. కొవిడ్19 ఇన్‌పెక్షన్‌కు గురైన తర్వాత మూడు నుంచి ఆరు నెలలపాటు వారిలో వస్తున్న మార్పుల్ని రికార్డు చేశారు. సగానికిపైగా వృద్ధుల్లో మతిమరుపు లక్షణాలు, నలుగురిలో ఒకరికి మాటల్లో తడబాటు, భాష సంబంధిత సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు.