పడగ విప్పుతున్న డెల్టా వేరియంట్
జాన్ హాప్‌కిన్స్ వర్శిటీ డేటా వెల్లడి
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా కేసులు కొన్ని నెలల తరువాత మళ్లీ పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడం, వ్యాక్సినేషన్ మందగించడం, జులై 4 న స్వాతంత్ర వేడుకల సందర్భంగా జనం పెద్ద ఎత్తున గుమికూడడం వంటి కారణాల వల్ల గత మూడు వారాలుగా రోజువారీ కొత్త కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. గత జూన్ 23న కరోనా నిర్ధారణ కేసులు 11,300 కాగా, సోమవారం ఈ సంఖ్య రెట్టింపు అయి 23,600 కు చేరుకుందని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ డేటా వెల్లడించింది. జులై నాలుగో వారం తరువాత కేసులు ఇంకా పెరుగుతాయని తాము కచ్చితంగా చెప్పలేక పోయినా చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా కేసులు పెరుగుతున్నాయని సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ డివిజన్ కో డైరెక్టర్ డాక్టర్ బిల్ పౌడెర్లీ పేర్కొన్నారు.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసిపి ) డేటా ప్రకారం దేశంలో 55.6 శాతం అమెరికన్లు కనీసం ఒక్క డోసైనా అందుకుని ఉంటారని వెల్లడైంది. వ్యాక్సినేషన్ శాతం తక్కువగా జరిగిన ఐదు రాష్ట్రాల్లో సరాసరి కేసుల సంఖ్య రెండు వారాలలో రెట్టింపు అయింది. మిసౌరిలో 45.9 శాతం, అర్కన్సాస్ లో 43 శాతం,నెవడాలో 50.9 శాతం, లూయిసియానాలో 39.2 శాతం,ఉటాలో 49.5 శాతం వరకు కేసులు పెరిగాయని నివేదిక వెల్లడించింది. అమెరికాలో నిత్యం సరాసరి 280 మంది కొవిడ్‌కు మృతి చెందుతున్నారు. అయితే జాన్‌హాప్‌కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం గత నెల వరకు రోజువారీ సరాసరి కేసుల సంఖ్య 11 వేలుగా ఉండగా, ఇప్పుడు అది 23 వేలకు పెరిగింది. గత మూడు వారాల్లోనే ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 150 శాతం పెరిగినట్టు డేటా వెల్లడించింది.
Covid-19 cases double in 3 weeks in US